Vasanta Krishnaprasad: ఎమ్మెల్యేకు సమస్యగా మారిన అధికార పార్టీ నేతలు
Vasanta Krishnaprasad: కృష్ణా జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ప్రతిపక్షంతో పాటు అధికార పార్టీ నేతలతో కూడా పోరాడుతున్నారట.
Vasanta Krishnaprasad: కృష్ణా జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ప్రతిపక్షంతో పాటు అధికార పార్టీ నేతలతో కూడా పోరాడుతున్నారట. ప్రతిపక్షంతోనే ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సొంత పార్టీ నేతలు తెరవెనుక చేస్తున్న విమర్శలతో తలబొప్పి కడుతోందని వాపోతున్నారట ఆ ఎమ్మెల్యే. పరిస్థితి చేయిదాటిపోయిందని భావించిన ఆ ఎమ్మెల్యే జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రితోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అతనితో గొడవపడుతున్న మరో నేత ఎవరు?
కృష్ణా జిల్లా మైలవరం అధికార వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రెండు రకాల తలనొప్పులు ఎదురవుతున్నాయట. ప్రతిపక్ష టీడీపీ మాజీ ఎమ్మెల్యే దేవినేని నుంచి ఒక సమస్య కాగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి అధికార పార్టీకే చెందిన కొందరు నేతలు సమస్యగా తయారయ్యారని వాపోతున్నారట. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు కృష్ణ ప్రసాద్‌కు ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యతిరేకంగా పనిచేస్తున్న సొంత పార్టీ నేతలతో వేగలేక ఇక జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అక్కడి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే ఇన్‌ఛార్జ్ మంత్రి ఎమ్మెల్యేను ఇబ్బంది పెడుతున్న పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాత్రమేనని మిగిలిన నేతల జోక్యం ఇకపై ఉండకూడదని హుకుం జారీ చేసారట పెద్దిరెడ్డి. ఎవరైనా నియోజకవర్గం పరిధిలో పార్టీకి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇంచార్జ్ మంత్రి హెచ్చరించినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనల వెనుక మైలవరం మాజీ ఎమ్మెల్యే, అధికార వైసీపీ ప్రస్తుత పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అనుచరులు ఉన్నారని వసంత వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే వసంత విషయంలో జోగి వర్గీయులు మొదటి నుంచి తేడాగానే ఉన్నారని తెలుస్తోంది. తాజాగా జరిగిన కొండపల్లి మునిసిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని వసంత వర్గం ఆరోపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీకి చాలా డ్యామేజ్ జరిగిందని అందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనేది జోగి రమేష్ వర్గీయుల ఆరోపణగా ఉంది. కొండపల్లి మునిసిపల్ ఎన్నికల్లో జోగి వర్గీయులకు ఎమ్మెల్యే వసంత సహకరించలేదని అందుకే తమ వర్గీయులు ఓటమి చెందారని జోగి రమేష్ వర్గం ఆరోపిస్తోంది. ఇరు వర్గీయుల మధ్య నెలకొన్న వైరి వాతావరణాన్ని సర్దుబాటు చేయడానికి ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. వివాదం ముదరడం వల్లనే ఎమ్మెల్యే వసంత ఫిర్యాదుతో మంత్రి నేరుగా రంగంలోకి దిగారని సొంత వైసీపీ నేతలు అంటున్నారు.
ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారణం కొండపల్లి మునిసిపల్ ఎన్నికే కారణంగా తెలుస్తోంది. నియోజకవర్గం పరిధిలో కీలకంగా ఉన్న ఎమ్మెల్సీ తలసిల రఘురాం, జోగి రమేష్‌లను కలుపుకుని వెళ్ళకపోవడం వల్లనే వివాదాలు ముదురుతున్నాయని పార్టీ నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, వరుస ఫిర్యాదులకు అదే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మిగతా నేతల్ని సమన్వయం చేసుకోవడం లేదన్నది వసంత కృష్ణప్రసాద్‌పై తలసిల రఘురాం, జోగి వర్గీయుల ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించగా కొండపల్లిలో మాత్రం ఎమ్మెల్యే కారణంగానే పరిస్థితి తారుమారు అయ్యిందని పార్టీ నేతలు అంటున్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే కుంపట్లు రాజేయడం అంటే ఏంటో మైలవరంలోనే చూడాలి. పక్కనే ఉంటూ ప్రతిపక్ష నేతల మాదిరిగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేకు సమస్యలు సృష్టిస్తున్నవారికి ఇన్‌ఛార్జ్ మంత్రి ఇచ్చిన వార్నింగ్ ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.