ఎక్కడైనా నాయకులు బాగానే ఉంటారు కార్యకర్తలే అటుఇటు కాకుండా పోతారు అనడానికి నిదర్శనం గన్నవరం నియజకవర్గం. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్న యార్లగడ్డ, వంశీలు ఇప్పడు ఒకే పార్టీలో వుండబోతున్నారని సగం క్లారాటీ వచ్చినా వంశీ ఇంకా వైసిపిలో చేరకపోవడంతో, సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే వుంది. వీరి సంగతి పక్కన పెడితే, కార్యకర్తలు మాత్రం అక్కడ అల్లాడిపోతున్నారు. ముఖ‌్యంగా యార్లగడ్డ అనుచరులు సందిగ్దంలో పడ్డారు. క్షణక్షం రక్తి కడుతున్న గన్నవరం క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది?
రెండు వారాల క్రితం తన మిత్రులైన సీఎం జగన్‌ను కలిసిన గన్నవరం నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆరోజునుంచి అజ్ణాతం వీడలేదు. వైసీపీలో చేరతానని, సగం క్లారిటీ ఇచ్చిన వంశీ, మిగతా సగంపై సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేసినా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడంతో అసలు చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.
కార్యకర్తలు మాత్రం వంశీ పేరుతో వైసిపి పోస్టర్లు పెట్టి సోషల్ మీడియాలో హల్ చల్ చేసేస్తున్నారు. వంశీ మాత్రం ఇంతవరకూ తన స్టాండ్ ఏమిటో చెప్పలేదు. సీఎంను కలిసిన రోజు ఉదయమే బిజేపి నేత సుజనా చౌదరిని కలిసిన వంశీ, వైసిపిలో చేరతారా, లేక బిజేపి తీర్థం పుచ్చుకుంటారా అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే వుంది.
ఇక యార్లగడ్డ విషయానికి వస్తే, వంశీ సీఎంను కలిసిన తరువాత రెండు, మూడు రోజులు కార్యకర్తలతో హడావుడి చేసి, ఇప్పుడు సైలెంటయ్యారు. వంశీ వైసిపిలోకి వస్తే ఐదేళ్ళుగా వైసిపినే నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోతారని, వంశీ బాధితుల పేరుతో ప్రెస్‌మీట్లు కూడా పెట్టించారు. ఒకవేళ వంశీ వైసిపిలోకి వస్తే, సీఎంను కలిసిన తరువాత తన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పి, ఇంతవరకు సీఎంను కలవలేదు యార్లగడ్డ. దీనిని బట్టి చూస్తుంటే, గన్నవరం పంచాయతీపై, రెండు వారాలుగా కార్యకర్తల హడావుడి తప్ప నాయకుల మధ్య హడావుడేమీ కనిపించడం లేదు.
వంశీ, యార్లగడ్డలు ఎవరి లాబీయింగ్ వారు చేసుకుంటున్నా, వీరిద్దరి వలన కార్యకర్తలు చాలా ఇబ్దంది పడుతున్నారు. గత టిడిపి హయాంలో, ఎవరైతే తమను ఇబ్బంది పెట్టారో మళ్ళీ అదే వ్యక్తి వైసీపీ తీర్థం పుచ్చుకుంటే కనుక, వైసిపి కార్యకర్తలే ఇబ్బంది పడతారని గన్నవరం వైసిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు టిడిపి కార్యకర్తల విషయానికి వస్తే, ఈ నాలుగైదు నెలలు నానా యాతన పడ్డామంటున్నారు. అధికారం ఉన్నప్పుడు వైసిపి వారిపై తమ జులుం ప్రదర్శించి, ఇప్పడు అధికారం కోల్పోయేసరికి తట్టుకోలేక వైసిపికి జంప్ చేయాలనే తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి రెండు వారాలుగా నలుగుతున్న గన్నవరం పంచాయతీ, ఎప్పటికి తేలుతుందో తెలియక, అసలు వంశీ వైసిపినో, బిజేపి నో తెలియక అటు టిడిపి కార్యకర్తలు, ఇటు వైసీపీ శ్రేణులు, తికమకైపోతున్నారట. ఇంతవరకు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వచ్చిన వంశీ, క్లైమాక్స్‌లో ఏ పార్టీ తరపున శుభం కార్డు వేస్తారో చూడాలి.