గుంటూరు జిల్లాలో ఏపీ వడ్డెర డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రేవతి మేనల్లుడు రెచ్చిపోయాడు. దాచేపల్లి మండలంలోని క్రాంతి నర్సింగ్ హోమ్‌లో హల్‌చల్ చేశాడు. వైద్యం అనంతరం బిల్లు కట్టమని ఆస్పత్రి సిబ్బంది అడగడంతో దురుసుగా ప్రవర్తించాడు వడియరాజు. తాను దేవుళ్ల రేవతి మేనల్లుడినని బిల్లు తక్కువ చేయాలని డిమాండ్ చేశాడు. దానికి ఆస్పత్రి సిబ్బంది ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆస్పత్రి సిబ్బందిపై దాడికి దిగాడు. దీంతో ఆస్పత్రిలోని పేషెంట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వడియరాజు తీరుపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సిబ్బందిపై వడియరాజు దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
మరోవైపు నిన్న గుంటూరు టోల్‌గేట్ దగ్గర ఏపీ వడ్డెర డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రేవతి హల్‌చల్ చేసింది. టోల్ కట్టమన్నందుకు సిబ్బందిపై చేయిచేసుకుంది. ఈ ఘటన మరువకముందే ఆమె మేనల్లుడు మరో వివాదంలో ఇరుక్కోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అత్తా, అల్లుళ్ల తీరుపై ప్రజలు, స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.