వర్షాభావంతో పంటలు పండక రైతులు వలసలు
* అనంతలో రైతులను నిండా ముంచిన అధిక వర్షాలు * పంట కోత సమయంలో వర్షాలతో రైతులు ఆందోళన * ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో శనగ పంట
ఖరీఫ్ ఆరంభం నుంచి పంటలను వెంటాడుతున్న అకాల వర్షాలు రబీలోనూ అన్నదాతలను నిలువునా ముంచాయి. చేతికందిన పంటను నోటి కందకుండా చేశాయి. కరవుసీమలో తాజాగా కురుస్తున్న వర్షాలతో పప్పుశనగ పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన సమయంలో వరుణుడు నిండా ముంచాడు. వేల ఎకరాల్లో పప్పు శనగ పంట తుడుచిపెట్టుకుపోయింది.
అతివృష్టి లేదా అనావృష్టి తో ఏటా అనంతపురంలో కరవు ఛాయలు కమ్ముకుంటున్నాయి. వర్షాభావంతో పంటలు పండక రైతులు వలసలు వెళ్తున్నారు. కరవు సీమ అనంతపురంలో ఈ ఏడాది అధిక వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. ఎన్నడూ లేని విధంగా పంట కోత సమయంలో వర్షాలు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పప్పుశనగ సాగు చేసిన రైతులకు భారీగా నష్టం వచ్చింది.
అనంతపురం జిల్లాలో ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రబీలో పప్పు శనగ పంట సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాలకు పైగా ఈ ఏడాది పంట సాగు చేశారు. మూడేళ్లుగా కరవు ఛాయలు కమ్ముకోవడం.. నవంబర్, డిసెంబర్‌లో ఆశించిన వర్షాలు కురవకపోవడంతో పప్పుశనగ రైతుల తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు సగటున రెండు, మూడు బస్తాల శనగలు కూడా రావడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
అప్పులు చేసి పంటలు సాగు చేశామని ఇప్పుడు పంట చేతికి రాక పెట్టుబడులు కోల్పోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది చివరి వరకూ వర్షాలు కురవడంతో ఆశించిన స్థాయిలో పంట వచ్చింది. సగటున పది నుంచి 12 బస్తాల పప్పు శనగ పండుతుందని రైతులు ఆశించారు. తీరా కోత సమయంలో అకాల వర్షాలతో పొలాల్లోనే పంట నానిపోయి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. కొందరు రైతులు పంట తొలగించడంతో పొలాల నుంచి బయటికి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. పప్పు శనగ మొలక వచ్చి రంగు మారుతుందని చేతికొచ్చిన పంటను వర్షం తుడిచిపెట్టుకు పోయిందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
మార్కెట్‌లో ఆశించిన ధరలు లేకపోవడం0 పంటలు అంతంత మాత్రంగానే పండుతుండంతో వేరుశనగ పంటకు ప్రతీఏడు నష్టాలు వస్తున్నాయి. ఒక్క ఎకరాకు సగటున రూ. పది వేల నుంచి 15 వేల వరకూ ఖర్చు వస్తోంది. బాగా పండితే 12 క్వింటాళ్ల శనగలు వస్తాయి. సగటున కొంత కాలంగా ఆరు క్వింటాళ్లకు తక్కువే దిగుబడి వస్తోంది.
అధిక వర్షాలతో నిండా మునిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతుసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులతో పాటు వచ్చే ఏడాదికి విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని కోరుతున్నారు.