Tirupati Bypoll: చంద్రబాబు పై రాళ్ల దాడి... వైసీపీ నేతలు కౌంటర్
Tirupati Bypoll: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు సభలో రాళ్ల దాడి జరిగింది.
Tirupati Bypoll: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలో కలకలం రేగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు సభలో రాళ్ల దాడి జరిగింది. బాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాయి విసిరారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఓ యువకుడికి గాయాలయ్యాయి. దీంతో చంద్రబాబు ప్రచార వాహనం దిగి రోడ్డుపై కాసేపు బైఠాయించారు. గాయపడిన కార్యకర్తలను పిలిపించుకుని ఆయన మాట్లాడారు.
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబు రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ముందుకు రండి తేల్చుకుందాం అన్నారు.. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. ఇక్కడే ఉంటానని.. నేనేంలో చూపిస్తానంటూ ఆయన హెచ్చరించారు. తమపై రాళ్ల దాడి చేసిన నిందితులను కఠినగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కృష్ణాపురం కూడలి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. వినతిపత్రం ఇచ్చేందుకు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆపేయడంతో రోడ్డుపైనే ఆయన నిలబడి నిరసన తెలిపారు.
చంద్రబాబు పై రాళ్ల దాడిపై వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. అసలు, చంద్రబాబుపై రాళ్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటూ ప్రశ్నించారు. రాళ్ల దాడి అంతా పెద్ద డ్రామాలాగా అనిపిస్తోందన్నారు. అసలు, చంద్రబాబుపై రాళ్లు వేశారో లేదో పోలీసులు తేల్చాలని పెద్దిరెడ్డి కోరారు. ఒక రాయిపడిందని.. ఎవరికి దెబ్బలు తగలేదని ఆయన స్పష్టం చేశారు. ఏదీ ఏమైనా.. చంద్రబాబు వాహనంపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని చంద్రబాబు విమర్శించారు. ఈ ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఢిల్లీ వెళ్లి ఈసీకి తమ ఎంపీలు ఫిర్యాదు చేస్తారని చంద్రబాబు అన్నారు.