టీడీపీ నేత హత్య.. హత్య కేసులో కీలకంగా మారిన ఫోన్..

Update: 2021-01-04 09:41 GMT

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి, టీడీపీ పార్టీ సీనియర్ నేత పురంశెట్టి అంకులును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కత్తులతో పొడిచి, మెడకోసి మరీ విచక్షణరహితంగా మర్డర్ చేశారు. దాచేపల్లి నగర పంచాయతీలోని సితారా రెస్టారెంట్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో అంకులు మృతదేహాన్ని గుర్తించారు.

ఫోన్ కాల్ రావడంతో సొంతూరి నుంచి అంకులు దాచేపల్లికి రాత్రి 7గంటల సమయంలో వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కారును రోడ్డు పక్కన ఆపి నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ వద్దకు వెళ్లారు. చాలాసేపటి వరకు రాకపోయేసరికి అనుమానం వచ్చిన డ్రైవర్ వెళ్లి చూసేసరికి అపార్ట్ మెంట్‌ మొదటి అంతస్తులో శవమై తేలినట్టు డ్రైవర్ తెలిపారు.

విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. హత్యకు నిరసనగా అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అంకుల్ హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస హత్యలు వైసీపీ హత్య రాజకీయాలకు నిదర్శనాలని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం అండచూసుకుని దుండగులు రెచ్చిపోతున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం టీడీపీ నేత అంకులు హత్య కేసులో ఫోన్ కీలకంగా మారింది. ఆదివారం సాయంత్రం సమయంలో ఫోన్ రావడంతో బయటకు వెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ శవమై తేలాడు. అంకులు చనిపోయిన తర్వాత అతడి ఫోన్ కనిపించకుండా పోయింది. అంకులు ఫోన్ మాయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్‌లిస్ట్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News