ఉండవల్లి అంటే జగన్‌కు గిట్టదా.. జగన్ కారు దిగి ఉండవల్లి ఎందుకు వెళ్లిపోయారు?

Undavalli Arun Kumar: ఆయన రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు.

Update: 2021-12-04 12:43 GMT

ఉండవల్లి అంటే జగన్‌కు గిట్టదా.. జగన్ కారు దిగి ఉండవల్లి ఎందుకు వెళ్లిపోయారు?

Undavalli Arun Kumar: ఆయన రాజకీయాల్లో కాకలు తీరిన యోధుడు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకుడు. సమస్యలు ఏవైనా సబ్జెక్ట్‌ ఏదైనా, అవతలి వాళ్లు ఎంతటి వారైనా దుమ్ము దులిపే మంచి వక్త. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన మాటే శాసనంగా చెలామణి అయిన లీడర్‌. అలాంటి నేత ఆ తండ్రి తనయుడితో డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేస్తున్నారు. నాడు వైఎస్‌ ఎంత చెబితే అంత... ఎలా చెబితే అలా నడిచిన నాయకుడు ఇప్పుడు జగన్‌ పాలనపై, ఆయన పనితీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. ఎందుకు? నాడు తండ్రి నచ్చితే ఇప్పుడు ఆ తనయుడు ఎందుకు నచ్చడం లేదు? ఇంతకీ ఎవరా లీడర్‌.?

ఉండవల్లి అరుణ్‌కుమార్. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. సబ్జెక్టు ఏదైనా దుమ్ముదులిపే వక్త. విభజన చట్టం నుంచి నవ్యాంధ్ర తొలి ప్రభుత్వం దాకా, సకల సమస్యలను ఎత్తి చూపే లీడర్. రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడుగా పదవీకాలం ముగిశాక తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు ఉండవల్లి. ఏ రాజకీయ పార్టీతో అనుబంధం పెట్టుకోలేదు. ప్రభుత్వాల పనితీరు, లోపాలను ఎండగట్టే పనిలోనే ఉండవల్లి కొనసాగారు. వైఎస్‌తో చాలా సన్నిహితంగా ఉండే ఉండవల్లి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, కొత్త ప్రభుత్వానికి దగ్గరవుతారని జోరుగా ప్రచారం సాగింది. ఇప్పటికీ అలాంటి ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడలేదు. అలా అని జగన్‌ సర్కార్‌ వెనుకేసుకొస్తున్న పరిస్థితీ లేదు.

రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లిది ఓ ప్రత్యేకమైన శైలి. ఏపీ విభజనపై పార్లమెంటులో ఫైట్ చేసిన వారిలో ఉండవల్లిది ప్రత్యేక పాత్ర. విభజన చట్టంలోని ప్రతి పాయింట్‌ను టచ్ చేస్తూ, ఎలుగెత్తిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే, అది ఉండవల్లే. ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీతో ఏపీ నుంచి నేరుగా మాట్లాడే నేతగా ఉండవల్లికి అప్పట్లో పెద్దపేరు. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా, ఆ‍యనకు అత్యంత సన్నిహితుడు ఉండవల్లి. వైఎస్, కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి ఏపీలో ఏం స్కెచ్ వేస్తే అదే ఏఐసీసీలో ఆమోదం అయ్యేది. వైఎస్సార్‌కు, సోనియాగాంధీకి మధ్య వారధిగా ఉండవల్లి వ్యవహరించేవారని అప్పట్లో చెప్పుకునే వారు కూడా.

అలాంటి ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్‌ తనయుడు వైఎస్‌ జగన్‌ అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్‌తో ఉన్న అనుబంధమే జగన్‌తోనూ కంటిన్యూ చేస్తారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు సరికదా ఇదిగో నువ్వు చేస్తున్నది తప్పు అన్నంతగా జగన్‌ను డైరెక్ట్‌ చేయసాగారన్న ప్రచారం జరిగింది. ఏపీలో పరిపాలన విధానాలను తప్పు పడుతూ, పాలకులు ప్రజా సమస్యల విషయాల్లో ఎలా ఉండాలో చెబుతూ తనదైన శైలిలో జగన్‌పై గన్‌ ఎక్కు పెట్టారన్న చర్చ నడిచింది. వాస్తవానికి జరిగింది కూడా అదే అంటారు అరుణ్‌కుమార్‌ అభిమానులు. పంతాలు, పట్టింపుల విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉండే అరుణ్‌కుమార్‌, ఏపీ సీఎం జగన్‌తో, ఆయన తండ్రి వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని చూపించలేకపోయారు. ఆ మాటకొస్తే ఉండవల్లి అలా ఉండలేదు. జగన్‌ ఆ చాన్స్‌ ఇవ్వలేదు.

నిజానికి, ఏపీలో వైసీపీ ఘనవిజయం సాధించడంతో ఉండవల్లి, జగన్ ప్రభుత్వానికి దగ్గరవుతారనే ప్రచారం జోరుగానే సాగింది. జగన్ ప్రభుత్వానికి సలహాదారునిగా ఉండవల్లి వుండొచ్చునేమోనన్న పుకార్లు కూడా షికార్లు చేశాయి. అయితే ఎపుడూ పాలకుల తప్పుల్ని వెతుకుతూ బయట పెట్టే పాత్ర పోషించిన ఉండవల్లి, ఆ దిశగా ఏమీ స్పందించలేదు. పైగా అభినందనలు తెలిపేందుకు జగన్‌ను ఉండవల్లి నేరుగా కలవలేదు. మీడియా ద్వారా జగన్‌కు అభినందనలు తెలిపిన ఉండవల్లి వైఎస్సార్ లాగా పరిపాలన సాగిస్తారనే నమ్మకం వుందంటూ జగన్‌కు పరోక్షంగా సలహా ఇచ్చారు. జగన్‌ను గతంలో కానీ, ఈ మధ్య కానీ నేరుగా కలవకపోవడానికి కొన్ని కారణాలు లేకపోలేదు. వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి, వైఎస్ ప్రభుత్వంలో అనేక విషయాలలో సూచనలు, సలహాలు ఇస్తూ వుండేవారు. ఉండవల్లితో సంప్రదించకుండా, చర్చించకుండా వైఎస్ ఏ కొత్తపథకం ప్రవేశ పెట్టేవారు కాదని చెప్పుకుంటారు నేతలు. వైఎస్సార్ అకాల మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకించిన జగన్, సొంతంగా ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు.

ఆ యాత్ర కొనసాగివ్వకుండా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం శతవిధాలా అప్పట్లో ప్రయత్నం చేసింది. అయినా జగన్ జగమొండిలాగా ఓదార్పు యాత్రను తూర్పు గోదావరి జిల్లా తుని నుంచి ప్రారంభించారు. తునిలో ఓదార్పు యాత్ర ప్రారంభం రోజున ఉదయాన్నే, ఉండవల్లి తుని వెళ్లి యాత్రలో వుండగానే కారులో జగన్‌తో కొంతసేపు చర్చించారు. సోనియాగాంధీ చెప్పిన మాటల్ని జగన్‌కు చెప్పిన ఉండవల్లి, ఓదార్పు యాత్ర ఆపాలని సూచించారు. అలా ప్రయాణం మధ్యలోనే జగన్ కారు దిగి వెళ్లిపోయారు ఉండవల్లి. ఆరోజు వారిద్దరి మధ్య ఏం జరిగిందో నేటికీ స్పష్టంగా బయటకు తెలియదు. అధిష్టానం రాయబారం మాత్రం ఫలించలేదు. అప్పట్నుంచి ఉండవల్లి, జగన్‌ను ఎక్కడా ప్రత్యేకంగా, రాజకీయంగా కలవలేదు. అంతేకాదు, వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని ఉండవల్లి అక్షరరూపంలో తీసుకువచ్చారు. అందులో వైఎస్సార్‌తో తనకు గల అనుభవాలను క్లుప్తంగా రాశారు ఉండవల్లి. మరి భవిష్యత్‌లో ఉండవల్లి రాజకీయభవితవ్యం ఎలా వుంటుందో, ఆయన నిర్ణయాలు ఎలా వుంటాయో చూడాలి.

Tags:    

Similar News