Srisailam: శ్రీశైలంలో ఐదురోజుల పాటు ఉగాది మహోత్సవాలు
Srisailam: శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి.
Srisailam: శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజు బుధవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో చండీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లోక కల్యాణార్థం జపాలు, నిత్యహోమం, రుద్రహోమం, జయాదిహోమాన్ని జరిపించారు. అమ్మవారి ఆలయ యాగశాలలో చండీహోమం అనంతరం యాగ పూర్ణాహుతి, వసంత్సోవం, అవబృథం కార్యక్రమాలు జరిగాయి. పూర్ణాహుతిలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలో ఆహుతిగా సమర్పించారు.
స్థానాచార్యుల ఆధ్వర్యంలో వసంతాన్ని (పసుపు, సున్నం, సుగంధద్రవ్యాలు కలిపిన మంత్రపూరిత జలం) సమత్రకంగా భక్తులపై ప్రోక్షించారు. అవభృథంలో రుద్రధ్యాయ మంత్రాలతో చండీశ్వరస్వామివారికి శుద్ధజలం, పంచామృతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళోదకంతో స్నపనం నిర్వహించారు. ఆ తర్వాత మల్లికాగుండంలో త్రిశూలస్నాన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. త్రిశూలస్నానం జరిగే సమయంల మల్లికాగుండ జలాన్ని తలపై ప్రోక్షించుకోవడం వలన పాపాలన్ని నశించి శ్రేయస్సు కలుగుతుందని ఆలయ పండితులు తెలిపారు. కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, అర్చకులు, పండితులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.