కమలాపురంలో వైసీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
* న్యూఇయర్ వేడుకల్లో వైసీపీ నేతల మధ్య గొడవ * వీరపనాయునిపల్లి మండలం పాయసంపల్లిలో ఘర్షణ * కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్న సుధాకర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వర్గాలు
కడప జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. కమలాపురం నియోజకవర్గ వైసీపీలో నేతల మధ్య కొనసాగుతోన్న ఆధిపత్య పోరు న్యూఇయర్ వేడుకల సందర్భంగా బయటపడింది. వీరపనాయునిపల్లి మండలం పాయసంపల్లిలో వైసీపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. దాంతో, సుధాకర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వర్గాలు పరస్పరం కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్నాయి. వేటకొడవళ్లతో ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. అయితే, వైసీపీ నేత సుధాకర్‌రెడ్డి తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ప్రత్యర్ధులపై కాల్పులు జరపడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతోనే వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులపై సుధాకర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఇరువర్గాలు కత్తులు, రాళ్లతో దాడులకు దిగారు. అదేసమయంలో, తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో సుధాకర్‌రెడ్డి కాల్పులు జరిపాడు. దాంతో, గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు గ్రామంలో ఘర్షణలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.