TTD: శ్రీవారి దర్శనం కోసం సామాన్య భక్తులకు టైం స్లాట్ దర్శనం
TTD: టైం స్లాట్ టోకెన్లను కేటాయించి దర్శనం చేయించాలని టీటీడీ ప్రణాళికలు
TTD: శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు వీఐపీల తరహాలో టైం స్లాట్ దర్శనం సదుపాయాన్ని కల్పించే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. ఇటీవల తాత్కాలికంగా రద్దు చేసిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని, తిరుపతిలోని సామాన్య భక్తులకు టైం స్లాట్ టోకెన్లను కేటాయించి గంట, రెండు గంటలలో స్వామివారి దర్శనం చేయించాలని టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది. అలాగే ఈ క్రమంలోనే టైం స్లాట్ తో పాటు పాత విధానమైన ధర్మదర్శనం కల్పించే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.
ప్రతి ఏటా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతానికి శ్రీవారి దర్శనానికి వివిధ టికెట్ల ద్వారా దర్శనభాగ్యం పొందవచ్చు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలు, నిత్యసేవలు, సిఫార్సు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం, వయోవృద్ధులు, వికలాంగుల దర్శనం, సుపథం, సర్వ దర్శనం అంటూ పలువిధాలుగా దర్శించుకొనే భాగ్యం కల్పిస్తోంది టీటీడీ. అయితే వీఐపీలు, వివిఐపిలకు శ్రీవారి దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంటే సామాన్యులకు మాత్రం 5 నుంచి 24 గంటలు పట్టే అవకాశముంది. గత పాలకమండళ్లు సామాన్య భక్తులకు త్వరితగతిగా దర్శన భాగ్యం కల్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసాయి.
ముందుగా భక్తులకు సమయ నిర్దేశం చేసి టైం స్లాట్ ఇవ్వడం ద్వారా భక్తులు క్యూలైన్ లో వేచియుండే సమయాన్ని తగ్గించవచ్చని టీటీడీ భావించింది. 2009 నాటికి నగదు చెల్లింపు చేసే దర్శనాలన్నీ టైంస్లాట్ విధానానికి వెళ్లి పోయాయి. వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలు, ఆర్జితసేవా టికెట్లు కలిగిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి వస్తే గంట నుంచి గంటన్నర వ్యవధిలో శ్రీవారిని దర్శించుకునే విధానం అమల్లోకి వచ్చింది.
స్వామి వారికి నిత్యం జరిగే ఉపచారాలు, నిత్య ఆరాధనలు, స్వామి వారు పవళించే సమయం పోను సామాన్య భక్తులకు 16 గంటలు మాత్రమే దర్శనసమయం ఉంటుంది. టీటీడీ అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో శ్రీవారి దర్శనానికి రోజురోజు పెరిగిపోతున్న సంఖ్య వల్ల గర్భగుడిలోని మూర్తిని దర్శించుకునే సమయం తగ్గిపోతూ వస్తోంది. స్వామిని దర్శించుకోవడానికి దక్కుతున్న సమయం ఒక సెకనుకు మించి లేదు. ప్రస్తుతం నిమిషానికి 89 మంది దర్శనం చేసుకుంటున్నారు. అయితే 1980 నాటికి ముప్పై వేల మంది శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చేవారు. స్వామివారిని కులశేఖర పడివరకు భక్తులు దర్శించుకోవడం వల్ల తక్కువ సంఖ్యలో భక్తులకు దర్శనభాగ్యం దక్కేది. దీంతో 1983లో లఘు దర్శనం ప్రారంభించారు. దీనితో మరింతమంది స్వామి వారిని దర్శించుకునే వెసులుబాటు లభించింది. ఇక 2006లో భక్తుల సంఖ్య 60 నుంచి 70 వేలకు చేరుకోవడంతో టీటీడీ మహా లఘు దర్శనం విధానాన్ని ప్రారంభించింది. కానీ 2010లో నెలకొన్న తోపులాటతో శాశ్వతంగా మహాలఘు దర్శనాలు అమలు చేశారు టీటీడీ అధికారులు.
1980వ సంవత్సరంలో నిమిషానికి 39 మంది, 1990లో నిమిషానికి 52 మంది, 2000లో 62 మంది, 2010లో 83 మంది కాగా ప్రస్తుతానికి 89 మంది శ్రీవారిని నిమిషంలో దర్శించుకుంటున్నారు. అయితే శ్రీవారి భక్తులు టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వస్తున్న భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం భాగ్యం కల్పించాలని, 15000 వేల మంది భక్తులకు అలిపిరిలోనే టోకెన్లు ఇచ్చే విధంగా మరో 15000 వేల టోకెన్లు నడకదారిలో ఇస్తే సులభంగా దర్శనం జరుగుతుందని సూచిస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ టైం స్లాట్ విధానంపై ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా కలియుగ దైవాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, మళ్ళీ టైం స్లాట్ అమలు చేయనుంది టీటీడీ. ఇందుకు సామాన్య భక్తుల సహకారం ఉంటే శ్రీవారిని మరింత త్వరగా దర్శించాకోవచ్చని టీటీడీ అంచనా.