Tirumala: తిరుమల శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం

* రానున్న మార్చిలో పనులు ప్రారంభించే యోచన

Update: 2022-11-23 02:57 GMT

తిరుమల శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం

Tirumala Tirupathi Devasthanam: తిరుమల శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులకు ముహూర్తం ఖరారయినట్లు తెలుస్తోంది. ఆలయ గోపురం పరిస్థితి ఎలా ఉంది..? దీనికి మరమ్మతులు చేయాలా లేదా..? అనే అంశాలపై పరిశీలిస్తున్నారు. తాపడం పనులు జరిగే సమయంలో బాలాలయం ఏర్పాటు. భక్తులకు ఎలా దర్శనం కల్పించాలనే అంశాలపై అర్చకులు, వేదపండితులు, ఆగమ సలహా మండలి సభ్యులతో చర్చించారు. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీ నేపథ్యంలో తాపడం పనులు సాధ్యమేనా?

శ్రీవారి ఆలయ ఆనంద నిలయానికి విజయనగర పాలనలోనే బంగారు రేకులు అమర్చినట్టు తెలుస్తోంది. ఏడు సార్లు బంగారు తాపడం చేశారని తెలుస్తోంది. అయితే పలువురు రాజులు, హథీరాంజీ మహంతులు తాపడం చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ ఏర్పాటయిన తర్వాత 1933లో ఒకసారి 1958లో చివరిగా 12 వేల తులాల బంగారంతో బంగారు రేకులను అమర్చారు. నిజానికి 1950లోనే ఆనంద నిలయానికి తాపడం పనులు మొదలైనప్పటికీ వివిధ కారణాలతో దాదాపు ఎనిమిదేళ్లపాటు కొనసాగాయి.

ప్రస్తుతం ఆనంద నిలయం కళావిహీనంగా మారుతున్న క్రమంలో మరోసారి బంగారు తాపడం చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఉన్నతాధికారులను బోర్డు ఆదేశించింది. ఆనంద నిలయం బంగారు తాపడంపై ఐదుగురు సభ్యులతో కూడిన ఆగమ సలహా మండలి ఇచ్చే సూచనలతో ముందుకు సాగాలని టీటీడీ భావిస్తోంది. స్వర్ణ తాపడానికి దాదాపు 100 కిలోల బంగారం అవసరమవుతుందని టీటీడీ అంచనా వేసినట్టు సమాచారం.

శ్రీవారి ఆలయం నిలయం బంగారు తాపడం పనులపై ఆగమ సలహా మండలి సభ్యులు పరిశీలిస్తున్నారని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. ఆగమ సలహా మండలిలో చర్చించిన తర్వాత 2023 మార్చి మొదటి వారంలో బంగారు తాపడం పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని పండితులంటున్నారు.

Tags:    

Similar News