TTD: భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయం

TTD: లడ్డూ నాణ్యతను పెంచే ప్రయత్నాలు చేస్తున్న టీటీడీ అధికారులు

Update: 2024-09-09 04:12 GMT

TTD: భక్తులకు అందుబాటులో లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయం

TTD Laddu Prasadam: తిరుమల.. ఈ పేరు వినగానే ప్రతి ఒక్క భక్తునికి మదిలో మెదిలేది ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. నిత్యం లక్షలాది మంది భక్తులు వెంకన్న దర్శనానికి వచ్చిన సమయంలో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక తన్మయత్వం పొందుతుంటారు.

అయితే ఇకపై భక్తుల చెంతకే శ్రీవారి లడ్డూలు అందించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాలలో లడ్డూ ప్రసాదాలను గతంలో ప్రతి శనివారం మాత్రమే విక్రయించేవారు. ఇక నుంచి ప్రతిరోజూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది. హైదరాబాద్, తమిళనాడు, బెంగుళూరు, కన్యాకుమారి, సహా పలు ప్రాంతాల్లో శ్రీవారి భక్తులకు లడ్డూను అందుబాటులోకి తెచ్చేలా.. తిరుమల తిరుపతి దేవస్థానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు వారంలో ఒకరోజే అందుబాటులో ఉండే తిరుపతి లడ్డూ ఇకపై అన్ని రోజులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

ఇక నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ ​నగర భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ౫౦ రూపాయలకే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, అమరావతి, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో లడ్డూల విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్వామివారి ప్రసాదం భక్తులకు మరింత చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.

ఇక మరోవైపు తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ రుచి, వాసన, నాణ్యత పెరగనుంది. తిరుమల శ్రీవారి భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. లడ్డూ ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు కర్ణాటక ప్రభుత్వ నందిని నెయ్యి వినియోగాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇటీవల తిరుమలలో భక్తులకు నిత్యం మూడున్నర లక్షల లడ్డూలను ప్రసాదంగా అందజేస్తున్న టీటీడీ తాజాగా లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించి, ప్రమాణాలు పెంచుతున్నట్లు స్పష్టంచేసింది. 

Tags:    

Similar News