తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో విషాదం
* వరుస పరుగు పందాల్లో గెలుస్తున్న రెండు జతల ఎద్దులు మృతి * రాష్ట్రవ్యాప్త ఎడ్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఎడ్లు * అక్కసుతోనే ఎవరో హత్య చేశారని రైతు సత్యేంద్ర ఆరోపణ
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరుస పరుగు పందాల్లో గెలుస్తూ మొదటి స్థానంలో నిలుస్తున్న రెండు జతల ఎడ్లను హతమార్చిన ఘటన సామర్లకోటలో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన వల్లూరి సత్యేంద్ర కుమార్ తన ఎడ్లతో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎడ్ల పరుగు పందెంలో పాల్గొంటూ ప్రధమ స్థానంలో నిలుస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో జరిగిన మూడు పందెంలలో సత్యేంద్ర ఎడ్లు రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచాయి.
అయితే నిన్న కృష్ణా జిల్లా కైకలూరులో పందెంలో పాల్గొని ఎడ్లను అర్ధరాత్రి సామర్లకోటకు తీసుకొచ్చి మాండవ్య నారాయణ స్వామి ఆలయం సమీపంలోని మకాంలో కట్టాడు. ఉదయం వచ్చి చూసేసరికి నాలుగు ఎడ్లు నురగలు కక్కుతూ మృతి చెంది ఉండడాన్ని గమనించిన సత్యేంద్ర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరో అక్కసుతోనే తన ఎడ్లను చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చనిపోయిన ఎద్దుల విలువ దాదాపు 35 లక్షల వరకు ఉంటుందని తెలిపాడు. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.