స్మార్ట్ సిటి కాకినాడలో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకూ చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా రహదారుల విస్తరించకపోవడం ఒకవైపు స్మార్ట్ సిటి పనుల్లో తీవ్ర జాప్యంతో మరోవైపు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ నిరుపయోగంగా మారడంతో ఇంకో వైపు ప్లాన్డ్ సిటీ ప్రజలు ట్రాఫిక్ ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
టౌన్ ప్లానింగ్‌లో సెకండ్ మద్రాస్‌గా పేరున్న కాకినాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. వాహనాల వినియోగం పెరుగుతున్నా అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగకపోవడమే ఇందుకు కారణమని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ నగరంలో సుమారు 4 లక్షల 50 వేల జనాభా ఉంది. నగరంలో ప్రధానమైన మెయిన్ రోడ్డు, సినిమా రోడ్డు, దేవాలయం వీధి భానుగుడి సెంటర్ ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు, దీనికి తోడు కాకినాడ నగరం నడిబొడ్డున ఉన్న రైల్వే లైన్ వల్ల ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
గత 8 ఏళ్లుగా కొండయ్యపాలెం వంతెన నిర్మాణానికి వస్తున్న అడ్డంకులతో ఆ రోడ్డు పూర్తిగా వినియోగంలో లేకుండా పోయింది. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పని చేయకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి తోడు సిబ్బంది కొరత కారణంగా వేలాది వాహనాలకు పదులు సంఖ్యలో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
పురపాలక సంఘం నుంచి కార్పొరేషన్ గా 15 ఏళ్ల క్రితం ఎదిగిన కాకినాడలో ఆ స్ధాయిలో మౌళిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్మార్ట్ సిటీగా అడుగులు వేస్తున్న కాకినాడ నగరంలో అవసరాలకు అనుగుణంగా రోడ్లు నిర్మాణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ నగరంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను పునరుద్ధించి ట్రాఫిక్ సమస్యను తీర్చాలని నగర వాసులు కోరుతున్నారు.