Tourism in AP: వారంలో పర్యాటకం.. బస్సులు ఏర్పాటుకు చర్యలు
Tourism in AP: కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన పర్యాటకాన్ని వారంలో రోజుల్లో పున: ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Tourism in AP: కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన పర్యాటకాన్ని వారంలో రోజుల్లో పున: ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటక ప్రాంతాలతో పాటు వాటికి అవసరమైన సదుపాయలకు సంబంధించి హోటళ్లను తెరిపించడంతో పాటు ప్రత్యేక బస్సులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి పేర్కొన్నారు. వీటితో పాటు అన్ లాక్ 3.0లో విధించిన షరతుల్లో భాగంగా జిమ్ లను సైతం తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. అయితే పర్యాటకులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.
కరోనా కారణంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని తిరిగి అభివృద్ధి చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే అన్ని జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తీసుకురానుంది. వారం రోజుల్లోగా పర్యాటకులకు అనుమతిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. టూరిజం హోటళ్లను కూడా తెరుస్తామని.. ఆగష్టు 15వ తేదీ నుంచి అన్ని చోట్ల నుంచి బోట్లు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెంపుల్ టూరిజాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అటు వారంలోగా టూరిస్ట్ బస్సులను కూడా సిద్దం చేస్తామన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా త్వరలోనే రాష్ట్రంలో జిమ్‌లను సైతం ప్రారంభిస్తామన్నారు. కాగా, త్వరలోనే నాలుగు క్రీడా వికాస కేంద్రాలను ప్రారంభిస్తామన్న మంత్రి.. ప్రతిభ కలిగిన పేదపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా గతేడాది రూ. 3 కోట్లు పేద క్రీడాకారులకు అందించామని.. ఇక ఈ ఏడాది కూడా మరో రూ. 3 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు.