పండించిన రైతుకు కన్నీరు.. అమ్ముకునే దళారీలకు పన్నీరు..టమాటా పంట తీరు!
* కర్నూలు జిల్లా పత్తికొండ టమాట పంటకు కేరాఫ్ * ఈ సారి అనుకున్నదాని కంటే ఎక్కువ దిగుబడి వచ్చిన టమాట * ఒక్కసారిగా కుప్పకూలిన టమాట ధర * కిలో రెండు రూపాయల కంటే తక్కువే * లబోదిబోమంటున్న రైతులు
టమాటా రైతుల విచిత్రమైన పరిస్థితి ఇది. పంట దిగుబడి పెరిగితే ధర పడిపోతుంది. ఆయింత కోట కూలీ కూడా దక్కదు. కోయించలేక పంట అలానే చేలోనే వదిలేయాల్సిన స్థితి. దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి టమాటా వినియోగదారులది. మార్కెట్లో కేజీ టమాటా 30 రూపాయలకు ఎప్పుడూ తగ్గదు. టమాటా విరివిగా దొరికే సీజన్ ధర ఇది. అదే టమాటా తక్కువ పంట వచ్చే రోజుల్లో ఈ ధర కేజీకి వంద వరకూ చేరిన పరిస్థితీ ఉంటుంది. కానీ, రైతుకు మాత్రం దక్కేది శూన్యం.
పాలకులు ఎవరైనా ప్రభుత్వాలు ఏవైనా రైతన్నల కష్టాలు మాత్రం అలానే ఉంటున్నాయి. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే.. తీరా పంట చేతికొచ్చాక ధర లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. కర్నూలు జిల్లాలో టమాట రైతులు పరిస్థితి అధ్వానంగా మారింది. పంట దిగుబడి బాగా వచ్చినందుకు ఆనందపడాలో, లేక పంట అమ్ముకునేందుకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడినందుకు బాధపడాలో అర్ధంకాక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ టమటా రైతులపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ...
మొన్నటి వరకు ఒక గంప 800 నుంచి 900 పలికిన టమాట ధర.. రెండు రోజుల క్రితం ఒక్కసారిగా కుప్పకూలింది. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో ఒక్కసారిగా ధర పడిపోయింది. కనివినీ ఎరుగని రీతిలో కిలో 40 పైసాలకు పడిపోవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని గొప్పలు చెబుతోంది. అయితే.. అందుకు విరుద్ధంగా రైతులను ఇబ్బందులు పెట్టే విధంగా ధరలు నెలకొరిగాయి. దీంతో రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన చెందుతున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో పండించే టమాటకు సీమ ఆపిల్ అని పేరు. అలాంటి టమాటను పండించే రైతులకు సరైనా గిట్టుబాటు ధర దొరకడం లేదు. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడటంతో టమాటా బాగా పండిందనుకుంటే.. అది కూడా లేదంటున్నారు రైతులు.
పత్తి కొండ పరిసర ప్రాంతాలలో పండిన టమాటను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతానికి కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది. పత్తికొండ మార్కెట్ లో కిలో టమాట కనీసం రూపాయి నుంచి రెండు రూపాయలు కూడా పలకడం లేదని వాపోతున్నారు.
ధరల విషయంలో పత్తికొండ టమాట రైతన్నను గట్టేక్కించాలంటే.. టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు చేశారు. పాలకులు, ప్రభుత్వాలు మారిపోతున్నారు. అధికారులు బదిలీలు అవుతున్నారు.. కానీ, జ్యూస్ ఫ్యాక్టరీ హామీ మాత్రం నీటి మీద రాతలు గానే మిగిలి పోతున్నాయి.
టమాట సంక్షోభం నుండి రైతులను ఆదుకుంటామని అటు ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులు హామీలు అయితే ఇస్తున్నారు. కానీ, వాటిని అమలు పరిచే దిశలో బలమైన అడుగులు వేయటం లేదని ప్రజలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. టామాట రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. టమాట జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి పంట రైతులను కాపాడాలని కోరుతున్నారు. మరి ఇప్పటి మాదిరిగా మనకెందుకులే అని అధికారులు వదిలి వేస్తారా లేదంటే అన్నదాత ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.