ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీకానుంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రుల ఫిర్యాదును స్పీకర్ తమ్మినేని సీతారామ్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు చేసిన ఫిర్యాదు అంశంపై ప్రివిలేజ్ కమిటీ ఆన్‌లైన్‌లో సమావేశంకానుంది.
ఫిర్యాదు చేసిన అంశాలపై మొదట విచారణ జరిపిన తర్వాత నిమ్మగడ్డకు నోటీస్ పంపే విషయంపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. జరిగిన పరిణామాలపై చర్చించి, ఎస్‌ఈసీకి నోటీసులు ఇచ్చి వివరణ అడగనుంది కమిటీ. 2006లో మహారాష్ట్రలో అక్కడ ఎస్‌ఈసీపై ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకుందంటున్నారు ప్రభుత్వ పెద్దలు.
గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తమను కించపరిచేలా, ప్రతిష్ఠను దిగజార్చేలా ఎస్‌ఈసీ పేర్కొన్నారని స్పీకర్‌కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా సభాహక్కుల కమిటీకి స్పీకర్ సోమవారం పంపారు.