తిరుపతి లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ

Update: 2024-09-22 11:08 GMT

Tirupati Laddu row: లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ లక్ష్యాల కోసం కోట్లమంది మనోభావాలు రెచ్చగొట్టే స్థాయికి దిగజారిపోయారని వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నారు. తిరుపతి లడ్డూల్లో కలుషితమైన నెయ్యి ఉపయోగించారు అని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు చేస్తోన్న తప్పుడు ఆరోపణలు వదంతులుగా మారుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో పవిత్రమైన లడ్డూల పేరు చెప్పి ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు నాయుడు కప్పిపుచ్చుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పెద్ద నేరం చేస్తున్నారన్న జగన్.. కొంతమంది చేస్తోన్న ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలకు ఉన్న ప్రతిష్ట మసకబారుతోందన్నారు.

ఏపీలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా చెప్పుకునే తిరుమల తిరుపతి దేవస్థానం వారు తయారు చేసే లడ్డుల విషయంలో గత ప్రభుత్వం రాజీపడిందని సీఎం చంద్రబాబు నాయడు సంచలన ఆరోపణలు చేశారు. భక్తులకు అందించే తిరుపతి లడ్డూ ప్రసాదాల్లో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉపయోగించారు అని చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనియాంశమైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఖండాంతరాలు దాటి వస్తుండటంతో ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్ అయింది.

జగన్ ఇంటిని చుట్టుముట్టిన హిందూ సంఘాలు

గత ప్రభుత్వం హయాంలో టిటిడి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించి లడ్డూల నాణ్యతను కలుషితం చేశారన్న ఆరోపణలు నేపథ్యంలో హిందూ సంఘాలు వైఎస్ జగన్ ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో తిరుపతి లడ్డూల వివాదంపై వైఎస్ జగన్ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అందులోనే ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాలను వివరిస్తూ తమపై పడిన అపవాదును తొలగించుకునే ప్రయత్నంచేశారు.

Tags:    

Similar News