#JustAsking ‘పవన్ కల్యాణ్... ఉన్న గొడవలు చాలు, పెద్దది చేయకు’ - ప్రకాశ్ రాజ్
Tirupati Laddu Row: తిరుపతి లడ్డు వివాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ నటులు ప్రకాష్ రాజ్ కు కౌంటరిచ్చారు.
Tirupati Laddu Row: డియర్ పవన్ కల్యాణ్, ఇది జరిగింది మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే, దోషులెవరో పట్టుకుని కఠినంగా శిక్షించండి. ఎందుకు దేశమంతటా భయాందోళనలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు? కేంద్రంలోని మీ మిత్రుల పుణ్యమా అని దేశంలో ఇప్పటికే మతపరమైన టెన్షన్లు చాలా ఉన్నాయి.’ #justasking హ్యాష్ట ట్యాగ్‌తో ప్రకాశ్ రాజ్ తిరుమల లడ్డూ వివాదంపై ఇలా ట్వీట్ చేశారు.
ఏపీ అధికార పక్షానికి బీజేపీ మిత్రపక్షమనే విషయాన్ని గుర్తు చేస్తూ పవన్ కల్యాణ్‌ను ప్రకాశ్ రాజ్ ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో రియాక్షన్స్ చాలా వచ్చాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రకాశ్ రాజ్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చారు. “తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని తెలియడంతో మేం చాలా కలత చెందాం. దీని వెనుక ఉన్నదెవరో కచ్చితంగా దర్యాప్తు చేసి, దోషులను శిక్షిస్తాం. ఈ విషయం ఇంతటితో ఆగిపోలేదు. దేశంలోని ఇతర ఆలయాలు, ధార్మిక సంస్థల చుట్టూ ఏం జరుగుతోందో ఈ వివాదం వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు సనాతన ధర్మ రక్షణ బోర్డు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీలాంటివారు కూడా కలిసి రావాలి” అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ప్రకాశ్ రాజ్ కామెంట్స్‌పై పవన్ మీడియాతో కూడా మాట్లాడారు. “మీరంటే నాకు గౌరవం ఉంది.. విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆయన సూచించారు. నేను వేరే మతాన్ని నిందించానా? తిరుపతి లడ్డు తయారీలో అపవిత్రం జరిగిందని చెప్పడం తప్పా” అని ఆయన ప్రశ్నించారు.
తిరుపతి లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం తమను ఆందోళనకు గురిచేసిందన్న పవన్ కల్యాణ్.. దీనికి వైఎస్ జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తప్పు చేసిన వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
ఈ వివాదం వెలుగులోకి రాగానే సెప్టెంబర్ 20న పవన్, సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
గతంలోనూ ఇద్దరి మధ్య వాదనలు
పవన్ కళ్యాణ్ పై గతంలో కూడా ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన విమర్శలు చేశారు. పవన్ నిర్ణయాలను ఊసరవెల్లితో పోల్చారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తులను ప్రస్తావిస్తూ మీకు రాజకీయాలు అవసరమా అని విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో తాను నిరుత్సాహపడినట్టుగా చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఆ పార్టీ మద్దతును ప్రస్తావిస్తూ మీ పార్టీ ఓటు షేర్ తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణకు కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ విధానాలకు ప్రకాష్ రాజ్ మద్దతుగా మాట్లాడారు.
తిరుపతి లడ్డు వివాదంలో ప్రకాష్ రాజ్ సహా వైఎస్ఆర్సీపీ నాయకుల తీరుపై కూడా పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ వివాదంలో మౌనంగా ఉండాలి. కానీ ఏది పడితే అది మాట్లాడవద్దని ఆయన సూచించారు.
అయితే, తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కలిపినట్లు తెలియడంతో గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులపై విమర్శలు వస్తుంటే, ప్రకాశ్ రాజ్ ఈ అంశాన్ని దేశంలోని మతపరమైన ఉద్రిక్తతలకు ముడిపెట్టడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.