Pawan Kalyan: తిరుమల లడ్డూపై వివాదం.. బాధ్యులపై కఠిన చర్యలు

Pawan Kalyan: జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.

Update: 2024-09-20 04:56 GMT

Pawan Kalyan: తిరుమల లడ్డూపై వివాదం.. బాధ్యులపై కఠిన చర్యలు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూ వివాదంపై శుక్రవారం స్పందించారు.సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తిరుపతి వెంకటేశ్వర్వస్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని తెలిసి తీవ్రంగా కలత చెందినట్టుగా ఆయన చెప్పారు. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఈ విషయమై అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయమై తమ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందన్నారు.

దేశంలోని అన్ని దేవాలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు జాతీయస్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, పౌరులు, మీడియాలో ఈ విషయమై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

లడ్డూకు ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ లడ్డూకు ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలున్నాయని చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు ఆరోపణలను వైఎస్ఆర్ సీపీ తోసిపుచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి సీఎం వ్యాఖ్యలపై స్పందించారు. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా చంద్రబాబు చెప్పుకుంటారు... తాను కూడా శ్రీవారి భక్తుడినే....ఈ వ్యాఖ్యలకు కట్టుబడి వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేయాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇందులో వాస్తవం లేదని తాను కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టుగా ల్యాబ్ రిపోర్ట్ లో వెల్లడైందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి ప్రకటించారు. ఈ రిపోర్ట్ ను మీడియాకు విడుదల చేశారు.

Tags:    

Similar News