Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదం: 10 ముఖ్యాంశాలు

Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జంతువుల కొవ్వును వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

Update: 2024-09-20 08:15 GMT

Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదం: 10 ముఖ్యాంశాలు

Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జంతువుల కొవ్వును వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ల్యాబ్ రిపోర్ట్ ను టీడీపీ బయటపెట్టింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశంలో ఈ ల్యాబ్ నివేదికను విడుదల చేశారు. ఈ రిపోర్ట్ విడుదల చేయడానికి ఒక్క రోజు ముందే అంటే ఈ నెల 18న అమరావతిలో చంద్రబాబు ఈ విషయాన్ని బయటపెట్టారు.

లడ్డూ వివాదంపై 10 అంశాలు

1. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. అయితే ఈ వాదనలను టీడీపీ తోసిపుచ్చింది. తన వాదనలకు బలం చేకూరేలా ల్యాబ్ నివేదికను ఆ పార్టీ బయటపెట్టింది.

2. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఈ నెల 18న అమరావతిలో మూడు పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా వదిలిపెట్టలేదని.. లడ్డూ తయారీలో నాసిరకం పదార్ధాలు, జంతువుల కొవ్వును ఉపయోగించారని ఆరోపించారు.

3.తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నమూనాల్లో కల్తీ జరిగిందని తేలిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. గుజరాత్ కు చెందిన లాబోరేటరీ రిపోర్ట్ ను ఆయన విడుదల చేశారు. జంతువులకు సంబంధించిన కొవ్వు, చేపనూనె కూడా ఉందని ఈ రిపోర్ట్ తెలిపిందని ఆయన చెప్పారు.

4. గుజరాత్ ల్యాబ్ కు ఈ నమూనాలను జులై 09,2024లో పంపారు. ల్యాబ్ రిపోర్ట్ అదే నెల 16న వచ్చింది.

5. ఈ ల్యాబ్ రిపోర్ట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, టీటీడీ నుండి అధికారిక ధృవీకరణ లేదు.

6. సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ లాబోరేటరి గుజరాత్ లో ఉంది.

7. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తిరుమలను అపవిత్రం చేసిందని...దీన్ని శానిటైజేషన్ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చంద్రబాబు ఈ నెల 18న చెప్పారు.

8. ఈ విషయమై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు, చేప నూనె, వాడినట్టు ల్యాబ్ రిపోర్టులు స్పష్టంగా చెబుతున్నాయన్నారు.

9. టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ ఓబీసీ జాతీయమోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు.జగన్ సీఎంగా ఉన్న సమయంలో లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు,చేపనూనె ఉపయోగించి సంస్కృతి, మతపరమైన వారసత్వంపై ప్రత్యక్షంగా దాడి చేశారని తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.

10. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వుందని చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ ఎంపీ, మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని ఆరోపించడం కంటే హేయమైన ప్రయత్నం మరోటి లేదని ఆయన చెప్పారు.

Tags:    

Similar News