Tirupati laddu controversy: తక్కువ ధరే కల్తీకి దారి తీసిందా?
Tirupati laddu controversy: తిరుపతి లడ్డు పవిత్రత, స్వచ్ఛతకు ఇప్పుడు ఎలాంటి మచ్చ లేదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
Tirupati laddu controversy: తిరుపతి లడ్డు పవిత్రత, స్వచ్ఛతకు ఇప్పుడు ఎలాంటి మచ్చ లేదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఆహార భద్రత ప్రమాణాలను నిర్ధారించేందుకు కల్తీ పరీక్ష యంత్రాన్ని ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో జె. శ్యామలరావు ప్రకటించారు. తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం కల్తీకి కారణమైందా అనే చర్చ కూడా తెరమీదికి వచ్చింది.
లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
బీఫ్ టాలో అంటే ఏంటి?
బీఫ్ టాలో అనేది బోవిన్ ల కొవ్వు కణజాలం నుండి తీసుకున్న కొవ్వు. దీన్ని కొవ్వొత్తుల తయారీలో, వంటలో ఉపయోగిస్తారు. బోవిన్ టాలో వేపుడుకు అనుకూలంగా ఉంటుంది. దీని రుచి బాగా ఉంటుంది. ఇది మోనో అన్ శాచురేటేడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. జంతువుల పక్కటెముకలు, ఇతర భాగాల నుంచి కొవ్వు నుంచి తయారు చేసిన పదార్ధాన్ని బీఫ్ టాలో గా పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు.
ఎలా తయారు చేస్తారు?
జంతువులకు చెందిన అవయవాలు ప్రత్యేకంగా మూత్రపిండాల చుట్టూ ఉండే కొవ్వు కణజాలాన్ని సూట్ అని పిలుస్తారు. ''రెండరింగ్ ప్రక్రియలో కొవ్వును కరిగించడానికి నెమ్మదిగా వేడి చేసి స్వచ్ఛమైన కొవ్వును వేరు చేస్తారు. దీన్ని క్రాక్లింగ్స్ అని పిలుస్తారు." కొవ్వు పూర్తిగా కరిగిన తర్వాత మిగిలిన ఘనపదార్థాలను తొలగించేందుకు వడపోస్తారు. ఇందులో మోనోశాచురేటేడ్ కొవ్వులు సమృద్దిగా ఉంటాయి. దీని కారణంగా చాలాకాలం పాటు నిల్వ ఉంటాయి.
తక్కువ ధరే కల్తీకి దారితీసిందా?
తమిళనాడులోని దిండిగల్ కేంద్రంగా పనిచేస్తోన్న ఏఆర్ ఫుడ్స్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు షార్ట్ లిస్టెడ్ అయిన ఐదు కంపెనీల్లో ఒకటి. ఈ సంస్థ లీటర్ నెయ్యిని రూ. 320 లకు సరఫరా చేస్తామని టెండర్ వేసింది. అయితే ఈ ఏడాది జూన్, జూలై వరకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్టుగా ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత సరఫరాను నిలిపివేయాలని టీటీడీ కోరడంతో నెయ్యి సరఫరాను నిలిపివేసింది.
తమకు 30 ఏళ్ల అనుభవం ఉంది. తమ ఉత్పత్తుల్లో ఎలాంటి కల్తీ చేయలేదని ఏఆర్ డెయిరీ ప్రతినిధి చెన్నైలో మీడియాకు చెప్పారు. టీటీడీ సేకరించిన నెయ్యిలో 0.1 శాతం మాత్రమే తమ సంస్థ నెయ్యిని సరఫరా చేసిందని ఆ సంస్థ వివరించింది. తాము సరఫరా చేసిన నెయ్యిని ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించి ఆ రిపోర్ట్ ను టీటీడీకి పంపామని ఏఆర్ డెయిరీ తెలిపింది. చేపనూనెను కూడా ఇందులో కలిపారనే ప్రచారాన్ని కూడా ఆ సంస్థ తోసిపుచ్చింది.
బ్లాక్ లిస్టులో కాంట్రాక్టర్
జంతు కొవ్వుతో తయారు చేసిన నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె.శ్యామలరావు చెప్పారు. రూ. 320-411 ల మధ్య నెయ్యి సరఫరా చేయడానికి పరోక్షంగా కల్తీ కారణమని ఆయన ఆరోపించారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇంత తక్కువ ధరకు సరఫరా చేసే అవకాశమే లేదని చెప్పారు. ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయలేమని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ 2023 లో వైదొలిగింది. లడ్డు నాణ్యతను పెంచేందుకు తిరిగి కర్ణాటక ఫెడరేషన్ నుంచి ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు.
రాజకీయ దుమారం
ఆంధ్రప్రదేశ్ లో వరద సాయంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగింది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాదు ప్రధాని మోడీకి , సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ఆయన లేఖ రాశారు.కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈ వివాదంపై చంద్రబాబుతో మాట్లాడారు.
లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల నెయ్యి ఉందని తేలడంతో ఆలయ సంప్రోక్షణలో భాగంగా యాగం నిర్వహించారు.