Tirupati: బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా తిరుపతి ఉపఎన్నిక
Tirupati: తిరుపతి ప్రచారంలో బీజేపీ సరికొత్త వ్యూహం * వైసీపీ, టీడీపీ అభ్యర్థులను తట్టుకునేందుకు ప్రణాళిక
Tirupati: తిరుపతి ప్రచారంలో బీజేపీ సరికొత్త వ్యూహాన్ని రచించింది. దాన్ని వ్యూహాత్మకంగా అమలు కూడా చేస్తోంది. అటు వైసీపీ, టీడీపీ అభ్యర్థులను తట్టుకునేందుకు ముందస్తు ప్రణాళికను రూపొందించింది. మొత్తానికి తిరుపతి లోక్‌సభ సీటును గెలుచుకునేందుకు కమలనాథులు వేసిన గేమ్ ప్లాన్ ఏంటి..?
తిరుపతి లోక్‌సభ సీటును గెలుచుకునేందుకు బీజేపీ ప్రత్యేక ప్రణాళికను, వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఏపీలో పట్టు కావాలంటే తిరుపతిలో మెట్టు దిగాలనుకున్న కాషాయ నేతలు.. సూటిగా సీఎం అభ్యర్థి పవన్ అంటూ చెప్పేశారు. చెప్పాలంటే కాపుల ఓట్లు అధికంగా వున్న తిరుపతిలో పవన్ చొరవ లేకుండా వారి ఓట్లను సాధించలేమని కమల నాథులు గుర్తించారు. అందుకే ఆయన్ని మచ్చిక చేసుకునేందుకు ఏకంగా సీఎం క్యాండిడెట్ అంటూ సోము వీర్రాజు ప్రకటన చేశారు.
ఇక తిరుపతి నియోజకవర్గంలో బలిజ కమ్యూనిటీ కూడా ఎక్కవగా ఉంటుంది. అయితే వీళ్లంతా ఒకప్పుడు చిరంజీవిని తమవాడని భావించి గెలిపించారు. ఇప్పుడు వీళ్లంతా పవన్‌ను ఆదరిస్తారని బీజేపీ అంచనా. అంతేకాదు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే జనసేనకు తిరుపతిలో మంచి కేడర్ ఉంది. అందుకే.. తిరుపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే రత్నప్రభ నేరుగా హైదరాబాద్ వెళ్లి పవన్ కల్యాణ్ మద్దతు కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి కూడా చేశారు.
ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో రాజకీయ ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలకు.. తిరుపతి ఉపఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. చెప్పాలంటే తమ పార్టీ పెద్దలు ఎంతమంది ప్రచారం చేసిన పవన్ లెక్క వేరని గ్రహించారు. అందుకే జనసేన మద్దతు లేకపోతే కష్టమని భావించే సీఎం క్యాండిడెట్ పవన్ అంటూ వ్యాఖ్యలు చేశారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతకీ పవన్ తిరుపతి ఎన్నికల ప్రచారానికి వెళ్తారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.