Tirumala: తిరుమలకు వెళ్తున్నారా? ఈనెల 8, 9వ తేదీల్లో ఈ సేవలు రద్దు..పూర్తి వివరాలివే
Tirumala news: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారా. అయితే మీకో ముఖ్యమైన గమనిక. ఎందుకంటే ఈనెల 8, 9వ తేదీల్లో తిరుమలలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. నవంబర్ 8న , శుక్రవారం రాత్రి 8 నుంచి 9గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ జరుగుతుంది. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు.
పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ్ర ద్రవ్యాలతో విశేష అభిషేకం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు పలు రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తర్వాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. నవంబర్ 8న అంకురార్పణ ఉంటుంది. దీంతో సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. నవంబర్ 9న పుష్పయాగం రోజు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలు రద్దు చేశారు. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
కాగా మంగళవారం రాత్రి భూదేవి, శ్రీదేవి శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7గంటలకు స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వేడుకను కనులారా తిలకించేందుకు తరలివచ్చారు. శ్రీవారి సహస్రనామాల్లో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం వంటి పదాలు పూజల్లో ఉపయోగిస్తారు.
రామావతారంలో లక్ష్మణుడిగా క్రుష్ణావతారంలో బలరాముడిగా ఆదిశేషుడు స్వామివారికి అత్యంత సన్నిహితుడు. శ్రీ వైకుంఠంలోని నిత్యసూరుల్లో ఆద్యుడైన ఆదిశేషుడు స్వామివారు దాసభక్తికి ప్రతీకగా నిలుస్తూ తన ప్రియభక్తునిపై ఉభయదేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తులకు దర్శనిమిచ్చారు. బ్రహ్మోత్సవ వాహనసేవల్లో తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇవ్వడం కూడా ఇందులో భాగమే.