విజయనగరం జిల్లాలో పులి కలకలం
Vizianagaram: దత్తిరాజేరు, తెర్లాం, మెరకముడిదాం మండలాల్లో సంచారం
Vizianagaram: విజయనగరం జిల్లాలో కొన్ని రోజులుగా పెద్ద పులి సంచరిస్తూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. జిల్లాలో తిరుగుతున్న పులి ఒకటా లేక రెండా అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది.
నెల రోజులుగా విజయనగరం జిల్లాలో పులి సంచారం జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎస్ కోట, కొత్తవలస మండలాల్లో సంచరిస్తున్న పులి.. ఆ తరువాత దత్తిరాజేరు, తెర్లాం, మెరకముడిదాం మండలాల్లో తిరుగుతూ గ్రామ శివార్లలో ఉన్న పశువుల సాలలో ఉన్న ఆవులపై దాడిచేస్తూ చంపుతుంది. అయితే తాజాగా వంగర మండలం నాయుడువలసలో పులి కనిపించడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. పులి అడుగులు గుర్తించిన అధికారులకు జిల్లాలో తిరుగుతున్నది ఒకటి కాదని రెండు లేదా అంతకంటే ఎక్కవ ఉండవచ్చని బావిస్తున్నారు. దీంతో జిల్లా వాసులను అప్రమత్తం చేశారు.
అనంతగిరి ప్రాంతాల్లో తిరిగిన పులి గతంలో ఎస్ కోట, కోత్తవలస మండలాల్లోని ఏజేన్సీ ప్రాంతాలలో కనిపించింది. ఆ తర్వాత దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ శీవారులో తిరుగుతూ ఆవుపై దాడి చేసింది. ఈ ఘటన జరిగిన రెండ్రోజుల్లోనే గజపతినగరం మండలం మరుపల్లి కొండపై పులి అడుగుజాడల్ని స్థానికులు గుర్తించారు. అయితే అదేరోజు కొత్తవలస మండలం గులివిందాడలో పులి అడుగులు కనిపించాయి. దీంతో జిల్లాలో రెండు పులులు సంచరించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గజపతినగరం మండలం జయతి పంచాయతీ బిరసాడవలసలో మేకల మందపై పులి దాడి చేసి రెండు మేకల్ని చంపేసింది. ఆ వెంటనే బొండపల్లి మండలం కొత్త పనసలపాడులో ఆవుని చంపి దూడను ఎత్తుకెళ్లింది. దీంతో పులి ఏ సమయంలో ఎవ్వరిపై దాడి చేస్తుందోనని జిల్లా వాసులు భయాందోళన చెందుతున్నారు.
వరుసగా జిల్లాలో ఎక్కడో ఒకచోట పులి సంచరిస్తూ జిల్లా వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత వారం రోజుల్లో పులి జాడలు కనిపించడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు. ఈ వారం రోజుల్లో మెరకముడిదాం మండలం పులిగుమ్మిలో పులి పాదముద్రలు గుర్తించడంతో పాటు మెంటాడ మండలం పెద చామరాపల్లిలో పులిని చూసి మోడల్ స్కూల్ విద్యార్థులు, సిబ్బంది పరుగులు తీశారు. అదేరాత్రి తెర్లాం మండలం గొలుగువలస పోలిమేరలో పులి సంచరిస్తూ కనిపించింది. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు పాదముద్రలు సేకరించడం తప్ప పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేయడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పులి సంచరించే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
మొత్తంగా జిల్లా వాసులను బెంబేలేత్తిస్తున్న పులిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి పులిని పట్టుకోవాలని వేడుకుంటున్నారు.