కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పశువులపై పులి దాడి
Kakinada: పొదురుపాక సమీపంలో ఆవును చంపిన పులి
Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా మరోసారి పశువులపై పులి దాడి చేసింది. పాండవులపాలెం - పొదురుపాక సమీపంలో ఆవును చంపింది. దీంతో సమీప శరభవరం, పాండవులపాలెం, పోతులూరు, ఒమ్మంగి గ్రామస్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పులిని వెతికే పనిలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
పది రోజులకు పైగా పులి సంచారం స్థానికులను కలవరానికి గురి చేస్తోంది. పులిని త్వరగా బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డీఆర్వో రామకృష్ణ అక్కడకు చేరుకొని ఫారెస్ట్ అధికారులతో చర్చించారు. మరోవైపు ప్రత్తిపాడు మండలంలోని పోతులూరు మెట్టపై పులి తిష్ఠ వేసినట్లు అటవీ సిబ్బంది నిన్న గమనించారు. మెట్ట దిగువన 5కిలోమీటర్ల దూరంలో మరో పాదముద్రను అటవీశాఖ గుర్తించింది. పులిని పట్టుకోవడం లేదా దాన్ని అడవిలోకి పంపే ఆపరేషన్‌లో భాగంగా పోతులూరులో బేస్ క్యాంప్ కొనసాగుతోంది.