దళితుల శిరోముండనం కేసుతో అధికార పార్టీలో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఈ కేసును తిరగదోడటంతో ప్రస్తుతం ఈ టాపిక్ పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. తోట త్రిమూర్తుల వ్యవహారంపై అధికార పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలను బలపరిచిన మాజీ ఎంపీ హర్షకుమార్ కామెంట్లు రామచంద్రాపురం రాజకీయాలను వేడెక్కించాయి.
దళిత శిరోముండనం కేసు మళ్లీ తెరమీదకు రావటం తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. తోట త్రిమూర్తులు టార్గెట్‌గా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హోంమంత్రికి రాసిన లేఖ సంచలనం రేపుతోంది. ఇప్పుడు జిల్లా పాలిటిక్స్‌లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.
23 ఏళ్ల క్రితం దళితుల శిరోముండనం కేసులో విచారణ ముమ్మరం చేయాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హోంమంత్రి సుచరితకు లేఖ రాశారు. ఈ కేసులో తోట త్రిమూర్తులు ఏ1గా ఉన్నారన్న సుభాష్ చంద్రబోస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. తోట త్రిమూర్తులు తనకున్న పలుకుబడితో కేసునుంచి తప్పించుకునేందుకు తెలివిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ లేఖతో రామచంద్రాపురం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.
అయితే దళితులపై తరుచూ అన్యాయం జరుగుతున్నందునే హోంమంత్రికి లేఖ రాసినట్లు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు ప్రధాన నిందితుడుగా ఉన్నాడని తమ పార్టీలో ఉన్నంత మాత్రాన వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పాడు. ఈ కేసుకు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. దళితులకు అన్యాయం జరిగితే సహించనని ఖరాఖండిగా చెప్పారు.
అటు హర్షకుమార్ కూడా తోట త్రిమూర్తులుపై ఆరోపణలు చేశారు. అసలు శిరోముండనం మొదలైందే రామచంద్రాపురం నియోజకవర్గంలో అన్నారు. శిరోముండనం చేసిన వ్యక్తికి సీఎం జగన్ రెండు పదవులు కట్టబెట్టారని విమర్శించారు. దళితులకు న్యాయం జరగాలనే తాను లేఖ రాశానని సుభాష్ చంద్రబోస్ చెబుతున్నా ఈ రచ్చ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి మరి.