జగన్ వైసీపీ ఫ్లాప్ షోలో రివర్స్ అయిన సీన్లు ఇవే...
ప్రభుత్వంలో జగన్ .. అంటే తాను, తన తరువాత వాలంటీర్ తప్ప మధ్యలో వ్యవస్థలన్నీ వృధా అని నమ్మటం, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయటం జగన్ చేసిన భారీ తప్పిదమన్న అభిప్రాయం బలంగా వినబడుతోంది.
జగన్ – వాలంటీర్... మధ్యలో ఎవరూ లేరు..!
ఘోర ఓటమికి అదే ప్రధాన కారణం. వ్యవస్థలన్నిటినీ కూల్చి... కేవలం పథకాలను నమ్ముకున్న ఫలితం అందనంత ఎత్తులో ఇసుక... కుదేలైన నిర్మాణ రంగం. ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది కార్మికులు సక్సెస్ అయిన కాపు - కమ్మల కాంబినేషన్. పవన్ పెళ్ళిళ్ళ గురించి హేళన చేయటంతో నొచ్చుకున్న కాపులు.. అసలుకే ఎసరు తెచ్చిన అభ్యర్థుల వలసలు...
ఓటమి.. ఘోరమైన ఓటమి .. రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని అత్యంత అవమానకరమైన ఓటమి .. ఈ ఓటమిని జీర్ణించుకోవటం, సమాధానపర్చుకోవటం ఇప్పుడల్లా సాధ్యమయ్యే పని కాదు.. వై నాట్ 175 అంటూ చేతులు మడుస్తూ తల ఎత్తుకుని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితం కావటంపై నివ్వెరపోయారు.
రాజకీయ పరిశీలకులు, పండితులు, విశ్లేషకులు..చివరకు ప్రతిపక్షాలు కూడా ఊహించని దారుణమైన ఓటమికి కారణాలేమిటి? ప్రజలు ఈ స్థాయిలో ఓట్ల రూపంలో ఆగ్రహం ప్రదర్శిస్తారా..!
గడిచిన అయిదేళ్లలో సుమారు రెండు లక్షల డెబ్బయి అయిదు కోట్ల ను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పేదలకు పంచటం వాస్తవమే..గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకు పాలన తీసుకొచ్చిన మాట కూడా వాస్తవమే.. విద్యా, వైద్య రంగాల్లో విప్తవాత్మక మార్పులు తీసుకొచ్చిన మాట కూడా వాస్తవమే..కరోనా సంక్షోభంలో వైద్యం అందించటంలోనూ, పేద ప్రజలను ఆదుకోవటంలోనూ అద్భుతమైన పనితీరును కనబర్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.
నాడు-నేడు ద్వారా సర్కారు బడులను కార్పొరేట్ స్కూళ్ళ కన్నా మిన్నగా తీర్చిదిద్దిన మాట కూడా కళ్ళకు కనబడుతున్న సత్యమే..ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే పేద పిల్లలు దర్జాగా యూనిఫారం, బూట్లు వేసుకుని..బ్యాగు తగిలించుకుని వెళుతున్న దృశ్యాలు కూడా కనబడుతున్నవే..ఇంగ్లీష్ మీడియంతో పాటు అనేక ప్రయివేట్ పాఠశాలల్లో అందుబాటులోని సీబీఎస్ ఈ, ఐబీ తదితర కరిక్యులమ్స్ ను ప్రవేశపెట్టటం హర్షించకుండా ఉండలేని వాస్తవమే.. ఇంకా, రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అందించిన సేవలు అన్నదాతలకు ఎంతోకొంత ఉపశమనం కలిగించటం కూడా నిజమే..!
జగన్ - వాలంటీర్.. మధ్యలో ఎవరూ లేరు..!
మరి, ఇన్ని చేసిన జగన్ చిత్తు చిత్తుగా ఎందుకు ఓడిపోయాడు.. ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని ఎందుకు మూట కట్టుకోవాల్సి వచ్చింది.. ఇవి అంతుచిక్కని ప్రశ్నలేవీ కాదు.. తన సొంత పార్టీనీ, ప్రభుత్వాన్ని వ్యవస్థాగతం చేయకుండా సర్వం తానేనన్న భ్రమను నిజం చేసేందుకు పడ్డ ఆరాటం, అహం ఈ ఘోర ఓటమికి గల ప్రధాన కారణాల్లో ఒకటని పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వంలో జగన్ .. అంటే తాను, తన తరువాత వాలంటీర్ తప్ప మధ్యలో వ్యవస్థలన్నీ వృధా అని నమ్మటం, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయటం జగన్ చేసిన భారీ తప్పిదమన్న అభిప్రాయం బలంగా వినబడుతోంది.
తన పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలు గడిచిన అయిదేళ్ల కాలంలో ఒకటి రెండు సార్లు తప్ప జగన్ ను కలవలేకపోయారు. సొంత ఎమ్మెల్యేలకయినా జగన్ అపాయింట్ మెంట్ దొరకటం అంత కష్టం.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. ఎమ్మెల్యేల మనోభావాలు ఎలా ఉన్నాయి..చేపట్టాల్సిన పనులేమిటీ.. నిధుల సంగతేమిటని వారినడిగిందీ లేదు.. జగన్ ను కలిసి గోడు వెళ్ళబోసుకునే అవకాశం కూడా రాలేదు.. అంగబలం, అర్ధబలం దండిగా ఉండి దౌర్జన్యాలు చేయగలిగిన అతి కొద్ది ఎమ్మెల్యేలు మాత్రం బాగుపడ్డారు. అనేకమంది ఎమ్మెల్యేలపై భూ కబ్జాల ఆరోపణలు వచ్చినా వారిని నియంత్రించిన దాఖలాలు లేవు. ఫలితంగా స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూములు పోతాయంటూ తెలుగుదేశం పార్టీ చేసిన విస్తృత ప్రచారం జనంలోకి బాగా వెళ్ళటానికి ప్రధాన కారణం కూడా అదే..
పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళను హేళన చేశారు... కాపుల కోపానికి గురయ్యారు
కాపుల ఓటింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక వైఫల్యం చెందారు.. కోస్తా జిల్లాల్లో గెలుపు ఓటములను శాసించగలిగిన సంఖ్యలో కాపుల ఓటు బ్యాంకు ఉంది..ఆరంభంలోనే వారంతా పవన్ కళ్యాణ్ వెంట లేదు.. కమ్మ సామాజికవర్గంతో ఆది నుంచి ఉన్న వైరుధ్యాల వల్ల కాపులంతా తటస్థ వైఖరితోనే ఉన్నారు.. బహిరంగ సభల్లో పవన్ కళ్యాన్ పెళ్ళిళ్ళపై జగన్ పదే పదే ప్రస్తావించటం కాపుల్లో అసహనం పెంచింది. చివరకు దత్తపుత్రుడికి నలుగురు పెళ్ళాలంటూ ప్రస్తావించటం ఆగ్రహం తెప్పించింది.
పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో సభ్యుడు కాకపోయినా అక్కడ కూడా అతని వ్యక్తిగత విషయమైన పెళ్ళిళ్ళ గురించి హేళన చేసి మాట్లాడటంపై కాపు సమాజం కోపోద్రిక్తమైంది. పవన్ కళ్యాన్ కాపు కుల అజెండాతో రాకపోయినా ఆ సామాజికవర్గం ఈసారైనా మన వాడ్ని గెలిపించుకోవాలని బలంగా భావించారు.. పిఠాపురంలో నన్ను గెలిపించండి..అసెంబ్లీకి పంపించండి ప్లీజ్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వేడుకోలు కూడా కాపు సమాజాన్ని కదిలించింది. ఫలితంగా గోదావరి జిల్లాలకు పరిమితమవుతుందని అందరూ భావించిన కాపుల ప్రభావం అన్ని జిల్లాలపై పడింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ గణనీయంగా ఉన్న ఓటర్లు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కూటమి వైపు మొగ్గారు. తెలుగుదేశం-జనసేనలు ఉమ్మడిగా ఓటు చీలకుండా పన్నిన వ్యూహం నూటికి నూరుశాతం విజయవంతమైంది.
ఇసుక బంగారమైంది... నిర్మాణ రంగం కుప్పకూలింది
రాష్ట్రంలో ఖనిజ వనరుల దోపిడీ.. ప్రత్యేకించి ఇసుక దోపిడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిండా ముంచింది. నదీ తీరాలు, వాగులు, వంకల వద్ద రీచుల్లో ఉన్న ఇసుకను అధికారపార్టీ నేతలు కొల్లగొట్టారు. అయిదేళ్ళుగా రకరకాల విధానాల ద్వారా తమ సొంత మనుషులకే, కంపెనీలకు ఇసుక రీచులను దారాదత్తం చేశారు. అంతే కాదు.. ఇసుకను బంగారంగా మార్చి సామాన్యుడికి అందనంత ఎత్తులో ధరలు పెట్టారు. దీంతో నిర్మాణ రంగం కుదేలైంది. అమరావతి రాజధాని నిర్మాణాలు నిలిచిపోవటంతో పాటు ఇసుక ప్రభావంతో దాదాపు అన్ని జిల్లాల్లో నిర్మాణరంగం చతికిల బడింది. ఫలితంగా నిర్మాణ రంగంపై ఆధారపడిన దాదాపు 10కు పైగా రంగాలకు చెందిన లక్షలాది కార్మికులకు పని కరువైంది. గడిచిన అయిదేళ్ళగా 80 శాతం మంది కార్మికుల అత్యవసరమైన మరమ్మతు పనులకు పరిమితమయ్యారు. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కార్మికులకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది.. వారంతా జగన్ బటన్ నొక్కి అందిస్తున్న పథకాలు తీసుకుంటున్న వారే అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్టు అంచనా. జగన్ హయాంలో వ్యవస్థలన్నీ ఎలా కూలిపోయాయో చెప్పటానికి నిర్మాణ రంగం కుదేలైన తీరే ప్రధాన సాక్ష్యం.
అభ్యర్థుల వలసలు... అసలుకే మోసం
ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్ధులను ఒక చోట నుంచి మరో చోటకు మార్చటం ద్వారా జగన్ చేసిన ప్రయోగం ఘోరంగా విఫలమైంలి. స్థానిక అభ్యర్ధులను కాదని మరో చోట నుంచి అభ్యర్ధులను పంపించినపుడే రాష్ట్రంలోని 30 మందికి పైగా కూటమి అభ్యర్ధుల విజయం ఖాయమైందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.. ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలను ఉదాహరణకు తీసుకుంటే గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే, మంత్రి మేరుగ నాగార్జునను ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి పోటీ చేయించారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను ఇష్టం లేకపోయినా బలవంతంగా కొండెపికి తీసుకొచ్చారు. కొండెపి టికెట్ ఆశించిన వరికూటి అశోక్ బాబును గుంటూరు జిల్లా వేమూరుకు పంపించారు.
చిలకలూరిపేట నుంచి గెలిచి మంత్రిగా ఉన్న విడదల రజనీని గుంటూరు వెస్ట్ కు పంపించారు..గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడికి అనూహ్యంగా చిలకలూరిపేట సీటిచ్చారు. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వకుండా చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పంపించి పోటీ చేయించారు. నెల్లూరు ఎంపీ టికెట్ విషయంలోనూ జగన్ భారీ తప్పుకు పాల్పడినట్టు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. నెల్లూరు జిల్లాల వైసీపీకి కొండంత అండగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళేలా చేశారు.
జగన్ కోర్ టీంలో ఒకడిగా, ఢిల్లీ స్థాయిలో పార్టీ అంతర్గత వ్యవహారాలు చూస్తున్న విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా నెల్లూరు లోక్ సభ నుంచి పోటీ చేయించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ నుంచి నెల్లూరు సిటీ సెగ్మెంట్ నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్ ను పోటీ చేయించారు. ఇలా కొందరు నాయకులు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా పోటీ చేయాల్సి రావటం.. కొత్త నియోజకవర్గాల్లో తమను పరిచయం చేసుకోవటానికే సమయం సరిపోవటంతో వైఫల్యాన్ని మూటకట్టుకున్నారు. ఐ ప్యాక్ చెప్పటంతోనే ఇష్టారీతిన పోటీ చేసిన స్థానాలను మార్చారనీ, తామెంత మొత్తుకున్నా అధినాయకుడు వినకపోవటంతో భారీ నష్టం వాటిల్లిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అలా 2019లో సూపర్ హిట్ అయిన వైసీపీ సినిమా, 2024లో సూపర్ ఫ్లాప్ అయింది.