ఏపీలో మూడు రాజధానుల ముచ్చట సైడ్ అయిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశమే ఇప్పుడు మెయిన్ ట్రాపిక్‌గా మారింది. ఉక్కు ఉద్యమంపై జనం కదులుతున్నారు. ప్రవేటీకరణ వద్దంటూ స్వరం విప్పుతున్నారు. సీఎం జగన్ సైతం స్టీల్ ప్లాంట్‌పై పెదవి విప్పారు. విశాఖకు వెళ్లి మరీ ప్రవేటీకరణకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని జగన్ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలని కేంద్రానికి లేఖ కూడా రాశామని చెప్పారు. అసలు లేఖ రాయలేదని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
విశాఖకు వచ్చిన సీఎం జగన్‌ను కార్మిక సంఘాల ప్రతినిధులు కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎంకు కార్మిక సంఘాల నేతలు వినతి పత్రం అందజేశారు. పోస్కో ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి తనను కలిసిన మాట వాస్తవమే అని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. పోస్కో వాళ్లు విశాఖకు వస్తున్నారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని జగన్ స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్‌కు దాదాపు రూ. 22వేల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు సీఎం జగన్. పైగా సొంతంగా గనులు లేకపోవడం వల్ల ప్రతి టన్నుకు రూ. 4వేలు అదనంగా ఖర్చు అవుతోందన్నారు. అయితే ఈ రెండు సమస్యలకు పరిష్కార మార్గాలను సైతం కేంద్రానికి రాసిన లేఖలో ప్రస్థావించామని సీఎం చెప్పుకచ్చారు.
ఇనుపఖనిజ నిల్వలు పుష్కలంగా ఉన్నా ఒడిషాలో ఈ ప్లాంట్‌కు ఐదు గనులు కేటాయించాలని డిమాండ్ చేశామన్నారు. ఏడాదికి దాదాపు 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉంది. ఈ నేపథ్యంలో ఒడిశా గనులను లీజ్‌కి ఇవ్వడమే సమస్యకు పూర్తి పరిష్కారమార్గామని ముఖ్యమంత్రి చెప్పారు. కార్మిక సంఘాల నేతలతో సమావేశం అనంతరం సీఎం జగన్.. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్నారు. స్వరూపనందేంద్రస్వామి ఆధ్వర్యంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు.