Legislative Council : అవకాశం నలుగురికి.. ఆశ ఎందరిదో.. ఏపీ శాసనమండలి లో స్థానం కోసం తీవ్ర పోటీ!
Legislative Council : ఏపీలో త్వరలోనే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. గవర్నర్ కోటాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీ ల పదవీ కాలం గత నెలలోనే ముగిసింది. తాజాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. మొత్తం నాలుగు స్థానాలపై అధికార వైసీపీలో చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
ఏపీ శాసనమండలిలో త్వరలో నాలుగు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగ ఉన్న రత్నబాయి, కంతేటి సత్యనారాయణల పదవీ కాలం గత నెలలోనే ముగిసింది. తాజాగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నాలుగు స్థానాలు మళ్లీ అధికార వైసీపీకే దక్కనుండగా, ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
వైసీపీకి ముందు నుంచి సేవలు అందిస్తున్నవారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని పలువురికి జగన్ హామీ ఇచ్చారు. అలాగే, ఎన్నికలకు ముందు టికెట్ త్యాగాలు చేసినవాళ్లకి కూడా మండలి సీటు ఆశ పెట్టారు. ఇలా ఎమ్మెల్సీ సీట్లపై జగన్ నుంచి హామీ పొందినవారు పదుల సంఖ్యలో ఉన్నారు. నాలుగు సీట్లు ఖాళీ అయిన నేపథ్యంలో ఈ సారి తమకే ఛాన్స్ వస్తుందని ఆశపడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
నాలుగు ఎమ్మెల్సీ సీట్లను సామాజిక వర్గాలవారీగా జగన్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన మైనారిటీ నేతకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మరో స్థానం ఎస్సీకి మిగిలిన రెండు స్థానాలను బీసీలతో భర్తీ చేస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. పిల్లి, మోపిదేవి స్థానాలను ఆ సామాజిక వర్గం నేతలకే ఇస్తారని భావిస్తున్నారు.
నాలుగు ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిజమైన అభ్యర్థులు ఎవరో తెలుస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. మండలి రద్దు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది అని, అంతవరకు ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తామంటున్నారు.