TTD: నేటితో ముగియనున్న టీటీడీ పాలకమండలి గడువు.. ఈనెల 10న కొత్త ఛైర్మన్ బాధ్యతలు
TTD: త్వరలో కొత్త పాలకమండలి సభ్యుల నియామకం
TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలోని ప్రస్తుత పాలకమండలి గడువు నేటితో ముగియనుంది. ఈనెల 10న కొత్త ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ సన్నిధిలో ఉదయం 11 గంటల 44 నిమిషాలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక పాలకమండలి సభ్యుల నియామకం కూడా త్వరలో చేపట్టనున్నారు.
నాలుగేళ్లు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేయడం సంతృప్తినిచ్చిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఆ అదృష్టాన్ని ప్రసాదించిన వెంకటేశ్వర స్వామికి, అవకాశాన్ని ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. స్వామి వారి దర్శనం కల్పించేందుకు L1, L2,L3 టికెట్లు రద్దు చేయడం.. సామాన్యులకు స్వామివారి తొలి దర్శనం కల్పించేందుకు విఐపి బ్రేక్ సమయాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాలు అత్యంత సంతృప్తి నిచ్చాయని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. నూతన ఛైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్‌రెడ్డి అనుభవం టీటీడీ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
ఇక సోమవారం జరిగిన చివరి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ ప్రస్తుత పాలకమండలి. ఈ సందర్భంగా నాలుగేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బోర్డు నిర్ణయాలను ప్రకటించారు. 4 కోట్ల రూపాయలతో అలిపిరి కాలిబాట మార్గంలోని మొదటి ఘాట్ రోడ్డులో మోకాలి మెట్టు నుండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం వరకు ఫుట్‌పాత్ షెల్టర్ల నిర్మాణానికి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. రెండు కోట్ల 20 లక్షలతో తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో విద్యుత్ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది బోర్డు. రెండున్నర కోట్లతో తిరుమలలోని PAC-1లో అభివృద్ధి పనులకు పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో రక్షణ గోడల నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. దీంతో పాటు నాలుగున్నర కోట్లతో శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదం తయారీకి వినియోగించే వంట సరుకులను మరింత నాణ్యంగా పరిశోధించేందుకు వీలుగా అత్యాధునిక యంత్ర పరికరాలు కొనుగోలు చేసేందుకు పాలక మండలి ఆమోదించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర భక్తులు వేచి ఉండేందుకు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తరహాలో 23 కోట్ల 50 లక్షలతో యాత్రికుల వసతి భవనం నిర్మాణం చేసేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుందని..త్వరలో అందుబాటులోకి రానుందని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి అవసరమైన స్పెషలిస్టు డాక్టర్లు, డ్యూటీ డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చామన్నారు.
అదేవిధంగా 75 కోట్ల 86 లక్షలతో అత్యాధునిక వైద్యపరికరాల కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది టీటీడీ పాలకమండలి. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్‌లో భక్తుల సదుపాయం కోసం 3 కోట్లతో సబ్‌వే నిర్మాణం.. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో 3 కోట్ల 10 లక్షల రూపాయల నిధులతో పార్కింగ్ వసతి, మినీ కల్యాణకట్ట, ఫెసిలిటీ సెంటర్ లాంటి అభివృద్ధి పనులకు పాలకమండలి నిర్ణయం తెలిపింది. వకుళ మాత ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాల ఏర్పాటుకు గానూ 9.85 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులు మంజూరు చేసింది పాలకమండలి.
తిరుపతిలోని శ్రీనివాస సేతుకు చివరి విడతగా 118 కోట్ల 83 లక్షలతో పనులు పూర్తి కాగానే చెల్లించడానికి ఆమోదం తెలిపింది పాలకమండలి. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులకు 5 కోట్లు మంజూరు చేయగా, తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలకు వినియోగించేందుకు ఎస్వీ గోసంరక్షణశాలలో సంప్రదాయ పద్ధతిలో నెయ్యి తయారీ ప్లాంటు ఏర్పాటుకు 4.25 కోట్ల రూపాయలను నిధులు కేటాయించారు. ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో అదనపు అంతస్తు నిర్మాణానికి 11.50కోట్లు... గ్రౌండ్ ఫ్లోర్ అభివృద్ధి పనులకు 2కోట్ల 60 లక్షలు.. ఆయుర్వేద కళాశాల విద్యార్థినుల హాస్టల్ భవనంలో అదనంగా మరో రెండు అంతస్తుల నిర్మాణానికి 3 కోట్లు వెచ్చించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది.