ఏపీలో నేటితో ముగియనున్న రెండో విడత పంచాయతీ నామినేషన్లు
* 8 రెవెన్యూ డివిజన్ల పరిధిలో జరగనున్న ఎన్నికలు * రేపు నామినేషన్ల పరిశీలన * ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు
ఏపీలో ఇవాళ్టితో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు ముగియనున్నాయి. ఈ సాయంత్రం 5 గంటలకు రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 8న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. రెండో విడతలో రాష్ట్రంలోని 3 వేల 335 పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 33 వేల 632 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
మరోవైపు ఇవాళ్టితో తొలి విడత నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియనుంది. ఫస్ట్ ఫేజ్ లో మొత్తం తొలివిడతలో 3వేల 251 సర్పంచ్ స్థానాలకు, 79 వేల 799 వార్డ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన కూడా పూర్తవగా 18 వేల 168 మందిని సర్పంచ్ అభ్యర్థులను అర్హులుగా గుర్తించారు అధికారులు. ఇవాళ్టితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుండటంతో.. సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.