AP Politics: ఏపీ పాలిటిక్స్‌లో మండే టెన్షన్‌

AP Politics: అన్ని పార్టీలకు కీలకంగా సోమవారం

Update: 2023-10-08 14:30 GMT

AP Politics: ఏపీ పాలిటిక్స్‌లో మండే టెన్షన్‌

AP Politics: ఏపీ పాలిటిక్స్‌లో సోమవారం కీలకం కానుంది. ఓ వైపు చంద్రబాబు కేసుల విచారణలు.. వైసీపీ విస్తృతస్థాయి సమావేశాలు.. జనసేన పార్టీ ముఖ్యనేతల భేటీతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. దీంతో సోమవారం ఏపీలోని అన్ని పొలిటికల్ పార్టీలకు కీలకం కానుంది.

స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు సంబందించిన పలు కేసులు రేపు కోర్టులో విచారణకు రానున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో బెయిల్ కోరతూ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు వేసిన పిటిషన్‌పై రేపు తీర్పు వెలువరించనున్నారు. దీంతో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై కూడా తీర్పు వెలువడనుంది. మరోవైపు హైకోర్టులో కూడా చంద్రబాబుకు సంబంధించిన మూడు పిటిషన్లు విచారణకు రానున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో.. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. బాబు భవితవ్యంపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉండటంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు జైలుకెళ్లి నెల రోజులు కావొస్తుండటంతో ఆ పార్టీ నేతలు అయోమయంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో కోర్టుల్లో బాబుకు ఊరట లభిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

 ఇక రేపు అధికార వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడలో 8వేల మంది వైసీపీ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ, సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌లు హాజరుకానున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోని అన్ని స్థాయిల నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు జగన్. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఓ వైపు టీడీపీ, జనసేన పొత్తుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తుండటంతో.. వారికి చెక్ పెట్టేలా వ్యూహరచన చేయాలని భావిస్తోంది వైసీపీ. ఈ దిశగా.. ప్రతినిధుల సభలో కార్యాచరణ రూపొందించనున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లో జనసేన కీలక సమావేశం నిర్వహించనుంది. టీడీపీతో పొత్తు అనంతరం దూకుడు పెంచిన జనసేన.. భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్య నేతలు భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News