అమరావతిలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రాయపూడిలో రైతుల జనభేరి సభలో పాల్గొనేందుకు బయల్దేరారు చంద్రబాబు. ఉద్యమం జరిగిన గ్రామాల మీదుగా వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్‌ను వెలగపూడి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. ఎలాగైనే వెళ్లి తీరుతామని టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది.
చంద్రబాబు వెహికల్‌ను మాత్రమే ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. మిగిలినవారు వెళ్లేందుకు వీలు లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ కాలినడకన ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేసిన ప్రదేశానికి చేరుకున్నారు చంద్రబాబు. రాజధాని ప్రాంతంలో వేసిన శిలాఫలకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడినుంచి రైతుల జనభేరి సభ జరిగే రాయపూడికి బయల్దేరి వెళ్లారు.