AP Elections 2021: ఏపీలో రేపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు
AP Elections 2021: ఉదయం 8 నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ * ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానంలో 17,467 ఓటర్లు
AP Elections 2021: ఏపీలోని ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రెండు స్థానాల నుంచి 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన రంపచోడవరం, ఎటపాక, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్‌ల పరిధిలోని కేంద్రాల్లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. 17న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఓటర్లు ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే వయెలెట్ స్కెచ్ పెన్ మాత్రమే వినియోగించి తమకు నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా తమ ప్రాధాన్యత అంకె వేయాల్సి ఉంటుంది. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ రాము సూర్యారావు పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈసారి ఆయన ఎన్నికల బరిలో లేరు. ఇక గుంటూరు-కృష్ణా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఎ.ఎస్.రామకృష్ణ పదవీ కాలం ముగియనుండటంతో మరోమారు ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానంలో 17వేల467 మంది ఓటర్లుండగా 116 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కృష్ణా–గుంటూరు స్థానానికి 19 మంది బరిలో ఉన్నారని, 13వేల 505 మంది ఓటర్లుండగా 111 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వివరించారు.