టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్ మంజూరు
Ashok Babu: విద్యార్హత తప్పుగా చూపారంటూ అశోక్ బాబు అరెస్టు.
Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు బెయిల్ మంజూరు అయింది. అశోక్ బాబును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ సర్వీసులో ఉండగా.. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారంటూ అశోక్ బాబు పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఈ క్రమంలో సీఐడీ కోర్టు శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచికత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అరెస్టు అనంతరం దాదాపు 17 గంటలపాటు అశోక్‌బాబును గుంటూరులోని సీఐడీ కార్యాలయంలోని ఉంచి అధికారులు విచారించారు. అనంతరం కరోనా పరీక్ష నిర్వహించి నెగిటివ్ రావడంతో అశోక్ బాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఫోర్జరీ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి అశోక్‌బాబుకు బెయిల్ మంజూరు చేశారు. కాగా.. టీడీపీ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో జడ్జి నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు.
చిన్న పొరపాటును పెద్ద నేరంలా చూపించారని అన్నారు అశోక్ బాబు. బెయిల్ మంజూరైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మెలో పాత్ర ఏంటి..? ఇది ప్రభుత్వానికి నచ్చలేదని సీఐడీ ప్రశ్నించిందని చెప్పారు. రాజకీయ కక్షలతో ఏమి చేయలేరని చెప్పారు అశోక్ బాబు.