ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడోరోజు హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరంపై సీఎం జగన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ నేతలు పదేపదే అడ్డుపడ్డారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన సీఎం జగన్ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. సభలో తన మెస్సేజ్ ను బయటకు పోనివ్వకుండా టీడీపీ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఒకవేళ తన ప్రసంగాన్ని చంద్రబాబు వినడానికి ఇష్టడకపోతే బయటకు వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగకుండా టీడీపీ నేతలను సస్పెండ్ చేయాల్సిందిగా స్పీకర్ తమ్మినేనిని కోరారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అనంతరం కాసేపటికి టీడీపీ సభ్యలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 9 మంది ప్రతిపక్ష సభ్యులను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్. కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోల బాలవీరాంజనేయ స్వామి, వేగుళ్ల జోగేశ్వరరావు, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌లను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.