నేటి నుంచి టీడీపీ మహానాడు..'జూమ్‌' ద్వారా పాల్గొననున్న 14 వేల మంది

Update: 2020-05-27 01:54 GMT
Chandrababu Naidu(File photo)

నేటి నుంచి రెండురోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబునాయుడు దివంగత నేత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించి, ఆపై ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆన్ లైన్ లోనే మహానాడు జరగనుంది. దాదాపు 14 వేల మంది కార్యకర్తలు జూమ్ యాప్ ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఇక తొలి రోజున మహానాడులో జగన్ సర్కార్ ఏడాది పాలనలో వైఫల్యాలు, రాజధానిగా అమరావతి కొనసాగించాల్సిన అంశాలతో పాటు, పోలవరం, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులపై నేతలు చర్చించనున్నారు.

ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు, అక్రమ కేసుల బనాయింపులు, రైతు రుణమాఫీ, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలూ చర్చకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విభాగం అధ్యక్షుడు కళావెంకటరావు సహా, కొందరు పొలిట్‌బ్యూరో సభ్యులు, ముఖ్య నేతలు మాత్రం మంగళగిరి సమీపంలోని పార్టీ జాతీయ కార్యాలయం నుంచి 'మహానాడు'లో పాల్గొంటారు. మిగిలిన నేతలంతా జూమ్‌ యాప్‌ ద్వారా భాగస్వాములవుతారు.

* టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఏపీ అధ్యక్షుడు కళావెంకటరావు ప్రసంగిస్తారు.

* 12 గంటల నుంచి 12.25 వరకు చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు.

* 12.25 నుంచి ఒంటి గంట వరకు తీర్మానాలు ప్రవేశపెడతారు.

* భోజన విరామానంతరం మళ్లీ 4 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.

* కరోనా నేపథ్యంలో మహానాడును ఈసారి రెండు రోజులకే కుదించారు.

* పార్టీ జాతీయ కార్యాలయంలోని చంద్రబాబు సహా ముఖ్యనేతలు భౌతిక దూరం పాటిస్తూ కూర్చుంటారు. ప్రత్యేకంగా వేదికంటూ ఉండదు.

* బుధవారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.

* మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనలో మృతి చెందినవారికి సంతాపం ప్రకటిస్తారు.

* గురువారం రెండోరోజు ఎన్టీఆర్‌ జయంతి వేడుకలతో మొదలవుతుంది.

* ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 వరకు వివిధ తీర్మానాలు ప్రవేశపెడతారు.

* భోజన విరామం తర్వాత మళ్లీ 4 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.

* రాజకీయ, సంస్థాగత తీర్మానాలతో పాటు, ఇతర తీర్మానాలు ప్రవేశపెడతారు.

* సాయంత్రం 5.05 నుంచి 5.30 వరకు చంద్రబాబు ఉపన్యాసంతో కార్యక్రమం ముగుస్తుంది.

ఈ సమావేశంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు, ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటన, కరోనా వైరస్‌ విజృంభణ- వలస కార్మికుల కష్టాలు, టీటీడీ ఆస్తుల అమ్మకం పై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 

Tags:    

Similar News