AP ZPTC, MPTC Elections: టీడీపీ పరిషత్ ఎన్నికల బహిష్కరణ..?

AP ZPTC, MPTC Elections: ఏపీలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది.

Update: 2021-04-02 03:01 GMT

తెలుగు దేశం జెండా 

AP ZPTC, MPTC Elections: ఏపీలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో అధికార పార్టీ..ఇప్పుడు విపక్ష పార్టీల కామెంట్లతో ఎన్నికల నిర్వహణ గందరగోళమైన ప్రక్రియగా మారింది. రాష్ట్ర కొత్త ఎలక్షన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 8న పోలింగ్‌ నిర్వహించి.. పదో తారీఖున ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఇక ఎన్నికలకు సంబంధించి ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఎస్ఈసీ.

గతేడాది రాష్ట్రంలోని 660 ZPTC స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో కోర్టు వివాదాలతో 8 స్తానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మిగిలిన 652 స్థానాల్లో 126 ఏకగ్రీవమయ్యాయి. 13 చోట్ల అభ్యర్థులు మృతి చెందారు. దీంతో మిగిలిన 513 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మరోవైపు 10వేల 47 MPTC స్థానాలుండగా.. విభజన, కోర్టు కేసులతో 354 MPTCలకు ఎన్నికలు నిలిచిపోయాయి. 2వేల 371స్థానాలు ఏకగ్రీవం కాగా.. 91 చోట్ల అభ్యర్ధుల మృతి చెందారు. మిగిలిన 7230 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. MPTC ఎన్నికల బరిలో మొత్తం 19వేల 2మంది అభ్యర్థులు నిలిచారు.

అయితే గతంలో ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించారు. దీంతో విపక్షాలు ఎస్‌ఈసీ ఏకపక్షంగా షెడ్యూల్ విడుదల చేశారంటూ మండిపడుతున్నారు. గతంలో నోటిఫికేషన్‌ వచ్చిన సమయంలో.. అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎస్‌ఈసీతో భేటీ అయిన టీడీపీ నేత వర్ల రామయ్య.. గత నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఎన్నికలు నిర్వహించొద్దని కోరారు. వైసీపీ దౌర్జన్యాలతో 24శాతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవాలయ్యాయన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు.

టీడీపీ కొత్త నోటిఫికేషన్‌ కోసం డిమాండ్ చేసినా.. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికార పార్టీకి నమ్మకస్తురాలైన నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టడంతో.. వైసీపీ మరిన్ని దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎన్నికల బహిష్కరణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది. ఎన్నికల బహిష్కరణపై నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు పార్టీ అధినేత చంద్రబాబు. మరోవైపు జనసేన కూడా అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇచ్చారని ఆరోపించింది.

ఇక విపక్షాల కామెంట్స్‌ ఎలా ఉన్నా.. ఎస్‌ఈసీ మాత్రం పరిషత్ ఎలక్షన్‌పై ఫోకస్ పెట్టారు. ఇవాళ ఎన్నికల నిర్వహణపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి జనసేన దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నోటిఫికేషన్‌ విడుదల చేశాక అఖిలపక్షంతో సమావేశమేంటని ప్రశ్నించారు. కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోర్టులో పిల్ వేస్తే.. తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఇచ్చారంటూ ఎస్‌ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అటు ఎన్నికలనే బహిష్కరించాలని చూస్తున్న టీడీపీ కూడా ఇవాళ సమావేశానికి హాజరై తమ అభిప్రాయం చెబుతుందా..? లేక మొత్తానికి బాయ్‌కాట్‌ చేస్తుందా అనేది చూడాలి మరి.  

Tags:    

Similar News