అమరావతి రైతులకు బేడీలు వేసినందుకు నిరసనగా టీడీపీ ఛలో గుంటూరు జైలు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దాంతో అప్రమత్తం అయిన పోలీసులు ముందస్తుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలను హౌస్ అరెస్ట్‌లు చేశారు. అటు జిల్లాల్లోనూ టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళన వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అసాంఘికశక్తులు చొరబడి ఆస్తి, ప్రాణ నష్టానికి పాల్పడతారని సమాచారం ఉందని నోటీసులో పేర్కొన్నారు. నోటీసు ఉల్లంఘించి ఆందోళనలో పాల్గొంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కృష్ణాయపాలెం ఎస్సీ, బీసీ రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం, వారికి సంకెళ్లు వేసి జైలుకు తరలించడంపై రాజధాని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్‌లకు వ్యతిరేకంగా రాజధాని జేఏసీ నేతలు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.