Kollu Ravindra's Remand Extended: మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు రిమాండ్ పొడిగింపు..
Kollu Ravindra's Remand Extended: వైఎస్సార్‌సీపీ నాయకుడు మోకా భాస్కర్ రావు హత్యా కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు
Kollu Ravindra's Remand Extended: వైఎస్సార్‌సీపీ నాయకుడు మోకా భాస్కర్ రావు హత్యా కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు. ఈ మేరకు మచిలీపట్టణం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గురు అరవింద్ ఆదేశాలు జారీ చేశారు. రేపు కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుంది. ప్రస్తుతం రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. కాగా గత నెల 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద మోకా భాస్కరరావును హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా వంశీకృష్ణ, చింతా నాగమల్లేశ్వరరావు, పోల రాము, ధనలతో పాటు ఓ బాలుడిని కూడా అరెస్ట్ చేశారు.
అయితే మోకా భాస్కర్ రావు హత్యలో కుట్ర జరిగిందని.. ఇది మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిందని పోలీసులు ఆరోపించారు. దీంతో కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా చేర్చి తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద అరెస్ట్ చేశారు. వీరందర్ని మొదట వీడియో కాన్ఫరెన్స్‌లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా, గతంలో బెయిల్ కోసం కొల్లు రవీంద్ర ప్రయత్నించారు. కానీ కుదరలేదు.. ఈ క్రమంలో ఆయన తోపాటు నిందితులు అందరూ జిల్లా కోర్టులో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి.