Chalamalasetty Sunil: ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సునీల్‌ను జగన్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా వేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీత, ఎమ్మె్ల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గతంలో వైసీపీలో చాలాకాలం కొనసాగిన సునీల్.. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ప్రత్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసిన సునీల్ ఓటమి పాలయ్యారు. చలమల శెట్టి సునీల్ రాజకీయప్రస్థానం ఎంతో ఆసక్తికరం అని చెప్పాలి. ఆయన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేశారు. తొలుత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో అదే స్థానం నుంచి బరిలో దిగినా అదృష్టం కలిసిరాలేదు. దాంతో వైసీపీకి గుడ్ బై చెప్పి 2019లో టీడీపీ తరఫున పోటీ చేశారు. అయినా మరోసారి ఓటమి పలుకరించింది. దాంతో ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు.