లాంగ్‌మార్చ్‌ వేదికగా కొత్త రాజకీయమా?

Update: 2019-11-05 08:43 GMT

ఔను వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. ఒకే వేదిక ఎక్కారు. చేతులు కలిపారు. ఎప్పుడో 2014లో కలిసిన మనసులు, 2019లో కకావికలమయ్యాయి. ఎన్నికల్లో ఫలితాల తర్వాత, బహుశా తమ స్నేహం విలువ మళ్లీ తెలుసుకున్నాయా అన్నట్టుగా ఏక స్వరం వినిపించాయి. ఇదంతా ఎవరి గురించో అర్థమైంది కదా. అవును. టీడీపీ-జనసేన. పవన్ లాంగ్‌ మార్చ్‌లో తెలుగు తమ్ముళ్లు కూడా మార్చ్ ఫాస్ట్ ‌చేశారు. వేదికనెక్కి ఇక కలిసి పోరాడదాం అన్నట్టుగా చేతులు కలిపారు. టీడీపీ-జనసేన మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తోందనడానికి లాంగ్‌ మార్చ్‌ రీ యూనియనే నిదర్శనమా ఎన్నికల్లో కలిసి నడిచిన వామపక్షాలు, లాంగ్‌‌మార్చ్‌లో జనసేనకు ఎందుకు హ్యాండిచ్చాయి కేంద్ర ప్రభుత్వ పెద్దలనూ కలుస్తానన్న పవన్, బీజేపీకి సైతం కనుచూపు మేరలో వున్నానని సంకేతమిచ్చారా లాంగ్‌ మార్చ్‌ సాక్షిగా రాజకీయ పరిణామాలు ఎలాంటి సంకేతమిస్తున్నాయి?

విశాఖపట్నంలో జనసేన లాంగ్‌ మార్చ్‌, ఊహించిన దానికంటే ఎక్కువే సక్సెస్‌ అయ్యిందన్న చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వం ఇసుక లభ్యతపై నిర్లక్ష్యం చేస్తోందని, లక్షలాది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొడుతోందని, సర్కారును గట్టిగా హెచ్చరిద్దామంటూ పవన్ కల్యాణ్‌ ఇచ్చిన పిలుపుకు, జనం కూడా బాగా స్పందించారని, వచ్చిన జనాన్ని బట్టి అర్థమవుతోంది.

ఈ స్థాయిలో సక్సెస్‌ అవుతుందని జనసేన నాయకులు అంచనా వేసుకోలేదట. లాంగ్‌ మార్చ్‌కు గంటా, గంటన్నర ముందు కూడా, జనాలెవరూ పెద్దగా లేరు. అసలు ప్రజలు ఎవరైనా వస్తారా, ఇలాగే రోడ్లు ఖాళీగా వుంటాయా అంటూ జనసైనికులు మాత్రం టెన్షన్ పడ్డారట. అందుకే లాంగ్ మార్చ్ ముగిసే దగ్గర ఏర్పాటు చేసిన సభా వేదికను కూడా చిన్నదిగానే ఏర్పాటు చేశారు. అయితే, లాంగ్ మార్చ్‌ ఒక అరగంటలో స్టార్ట్‌ అవుతుందనగా, ఎక్కడెక్కడి నుంచో భవన నిర్మాణ కార్మికులు ప్రత్యక్షమయ్యారట. దీంతో సాగర నగరం వీధులున్నీ జనసాగరాన్ని తలపించాయి.భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు, పస్తులకు ప్రభుత్వమే కారణమంటూ, ధాటిగా ప్రసంగం చేశారు పవన్ కల్యాణ్.

అయితే, లాంగ్‌ మార్చ్‌, భవన నిర్మాణ కార్మికుల నినాదాలతో హోరెత్తినా, ఇదే మార్చ్‌ సాక్షిగా భవిష్యత్ రాజకీయ పరిణామాలెన్నో సంకేతమిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన వామపక్షాలు, పవన్ లాంగ్‌ మార్చ్‌కు రాలేమంటూ ప్రకటించడం ఒక సంచలనమైతే, తనకే పోటీగా తయారవుతోందని జనసేనపై లోలోపల రగిలిపోతున్న టీడీపీ, అనూహ్యంగా పవన్‌తో కలిసి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

విశాఖ లాంగ్‌ మార్చ్‌‌కు మద్దతిచ్చి, కార్యకర్తలతో కలిసి పాల్గొనాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్, పార్టీల అధినేతలకు స్వయంగా ఫోన్‌లు చేసి విజ్ణప్తి చేశారు. అనేక తర్జనభర్జనల తర్వాత లాంగ్‌ మార్చ్‌కు దూరంగా వుండాలని వామపక్షాలు డిసైడైతే, తామే ఇసుక సమస్యపై మొదట స్పందించాం, బయటి నుంచి మద్దతిస్తాం కానీ, ర్యాలీలో పాల్గొనమంటూ బీజేపీ ప్రకటించి సర్‌ప్రైజ్ చేసింది. కానీ టీడీపీ మాత్రం అందర్నీ స్టన్నయ్యేలా చేసింది.

మొదటి నుంచి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది టీడీపీనే. దీంతో పవన్‌ లాంగ్‌ మార్చ్‌ ఆహ్వానాన్ని మన్నిస్తుందా లేదా అన్నది చివరి వరకూ సస్పెన్స్‌గా మారింది. కానీ సీన్‌ కట్‌ చేస్తే, లాంగ్‌మార్చ్‌లో టీడీపీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు సభా వేదికపై పాల్గొన్నారు. ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, ఇసుక సమస్య వేదికగా చేతులు కలపడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేసింది. జనసేనలాంగ్‌ మార్చ్ జనంతో ఇంతగా సక్సెస్‌ కావడానికి, టీడీపీనే దోహదం చేసిందా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది. ఇంతకీ జనసేనతో టీడీపీ చేతులు కలపడం దేనికి సంకేతం రాబోయే రాజకీయ పునరేకీకరణకు సన్నాహమా విడివిడిగా వుంటే జగన్‌ సర్కారుపై ఫైట్‌ చేయడం కష్టమని, కలిసి యుద్ధానికి తొడగొట్టాయా.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, వర్తమాన రాజకీయం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే వుంది. టీడీపీ-జనసేన విషయంలో ఇది మరోసారి ప్రూవ్‌ అవుతోందా ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురిస్తోందనడానికి లాంగ్‌ మార్చ్ వేదికే సంకేతమా కేంద్ర పెద్దలనూ కలుస్తానంటూ పవన్ ప్రకటించడం, కమలానికి సైతం దూరంగా లేనని సిగ్నల్స్ పంపించారా? లాంగ్‌ మార్చ్ ‌వేదికగా లాంగ్ పొలిటికల్‌ జర్నీ మొదలయ్యిందా?

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అక్కడున్నవారు ఇక్కడ, ఇక్కడున్నవారు అక్కడ ప్రత్యక్ష్యం కావచ్చు. తిట్టిన నోరు పొగడవచ్చు. శత్రువులుగా ముద్రపడిన పార్టీలే చేయిచేయి కలపొచ్చు. ఎన్నికల్లో మోడీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు, ఎన్నికలు అయిపోయాక, అరే బీజేపీతో దూరం కాకుండా వుంటే బాగుండేదని స్వయంగా చెప్పడం, ఎప్పటికప్పుడు మారే రాజకీయ పరిణామాలకు ఒక ఉదాహరణ. మొన్నటి ఏపీ ఎలక్షన్స్‌లో గట్టిగట్టిగా తిట్టుకోకపోయినా, టీడీపీ-జనసేనలు విడివిడిగా పోటీ చేసి, సై అంటే సై అన్నాయి. కానీ లాంగ్ మార్చ్ వేదికగా ఇప్పుడు చేతులు కలపడం, రాజకీయాల్లో వాట్‌ ఎవర్‌ విల్‌ హ్యాపెన్‌ అనడానికి ఎగ్జాంపుల్. ఇంతకీ టీడీపీ, జనసేనలు తిరిగి ఏకం కాబోతున్నాయా భవిష్యత్‌‌ రాజకీయానికి ఇదే సంకేతమా?

మొన్నటి ఎన్నికల్లో జగన్ ప్రభంజనానికి టీడీపీ, జనసేనలు అడ్రస్‌ లేకుండా పోయాయి. ఘోర పరాజయం పాలయ్యాయి. పవన్ కల్యాణ్‌ రెండు చోట్లా ఓడిపోయారు. అటు మంగళగిరిలో నారా లోకేష్‌ గెలవలేకపోయారు. జనసేన విడిగా పోటీ చేస్తే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి, అంతిమంగా అధికారపక్షానికే మేలు జరుగుతుందని టీడీపీ ఆలోచించింది. 2009లో ప్రజారాజ్యం రాకతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి, వైఎస్‌ సర్కారుకు ఎలా మేలు జరిగిందో, వైసీపీ-జనసేలకు ఓట్లు చీలి, తమకు ఢోకా ఉండదని చంద్రబాబు భావించారు. కానీ సీన్ రివర్సయ్యింది. పవన్ కల్యాణ్‌ పోటీ చేయడం, టీడీపీనే దెబ్బతీసింది. 2014లో ఏవైతే జనసేన, కాపు ఓట్లు పడ్డాయో, అవి మైనస్‌ అయ్యాయి. ప్రభుత్వ సానుకూల ఓట్లు చీలి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ గంపగుత్తగా వైసీపీకే పడ్డాయి. అంటే పవన్‌తో విడివిడిగా పోటీ చేస్తే, ఎప్పటికైనా తమకే ముప్పని గ్రహించిన టీడీపీ, ఇప్పుడు అదే పవన్‌కు దగ్గరవుతోందా అనడానికి, లాంగ్‌ మార్చ్‌లో వేదిక పంచుకోవడమే నిదర్శమన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

నిజానికి జగన్ సర్కారుపై సమైక్యంగా ఆందోళనలు చెయ్యాలన్నది చంద్రబాబు ఆలోచన. జనసేన, బీజేపీలకు కూడా ఇదే విష‍యం కొందరి ద్వారా చేరవేశారట. కలిసి నిరసనలు చేద్దామని ప్రతిపాదించారట. అయితే, తమకు దగ్గరవడానికి బాబు ప్రయత్నించినా, తాము మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తేలేదని బీజేపీ ప్రకటించింది. అయితే బాబు ప్రతిపాదనకు జనసేన సమ్మతించిందనడానికి, లాంగ్‌ మార్చ్‌లో పసుపు జెండాలు ఎగరడమే నిదర్శనమన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇలాంటి అవగాహన మున్ముందు కూడా కొనసాగుతుందా, టీడీపీ ఆందోళనల్లోనూ జనసేన పాల్గొంటుందా లేదంటే సెలక్టివ్‌గా మాత్రమే కలుస్తాయో అన్నది భవిష్యత్తే తేల్చాలి.

అయితే, లాంగ్‌ మార్చ్‌లో ఏకంగా టీడీపీ మాజీమంత్రులే పాల్గొనడం సహజంగానే వైసీపీ నేతలకు ఆయుధంగా మారింది. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రడని మరోసారి రుజువైందని ఆ పార్టీ నాయకులు విమర్శల బాణాలు ధాటిగా సంధిస్తున్నారు.

మొత్తానికి లాంగ్‌ మార్చ్‌తో జనసేన టీడీపీ కండువాలు రెపరెపలాడాయి. అయితే ఇదే సభా వేదికగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం తెచ్చుకున్నాయి. ఇసుక సమస్యపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికీ తీసుకెళ్తానని పవన్ వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. అంటే బీజేపీతో చంద్రబాబు తిరిగి చేతులు కలపాలనుకుంటున్నట్టు, పవన్ కూడా, కమలంతో కలుస్తారా అన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. రాష్ట్ర నాయకులైతే ప్రస్తుతం సొంతంగా ఎదిగేందుకు ఏ పార్టీతోనూ కలవకపోయినా, భవిష్యత్తులో 2014 దృశ్యం పునరావృతమవుతుందా అన్న అంచనాలు మాత్రం పెరుగుతున్నాయి. చూడాలి, రాబోయే రోజుల్లో, ఏపీలో రాజకీయ పునరేకీకరణ ఎలా వుంటుందో, ఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయో, ఏ పార్టీలు విడివిడిగా కలబడతాయో.

Full View 

Tags:    

Similar News