TDP in tension with YSRCP's BC strategy : వైసీపీ బీసీ స్ట్రాటజీతో టీడీపీలో టెన్షనేంటి?
TDP in tension with YSRCP's BC strategy : బీసీలకు పెద్దపీట వేయడం వెనుక జగన్ గేమ్ ప్లాన్ ఏంటి? బీసీ కార్పొరేషన్ ఏర్పాటుతో వైసిపిపై, ఆ జిల్లాలో టిడిపి చేస్తున్న ప్రచారానికి చెక్ పడనుందా? అధినేత సంధించిన అస్త్రాలు ఆశించిన ఫలితాలు తెస్తాయా? వెనుకబడిన వర్గాలపై అధికార పార్టీ కక్షసాదింపు చర్యలు అంటూ తెలుగుదేశం అభివర్ణనకు ఇకపై ఛాన్స్ ఉండబోదా? అసలు కుల రాజకీయ పేరిట సిక్కోలు పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?
రాష్ట్రంలోనే అత్యధిక బిసిలు కలిగిన ప్రాంతం ఉత్తరాంధ్ర. అందులోనూ వెనుకబడిన జిల్లాగా పేరొందిన శ్రీకాకుళంలో, బిసి ఓటర్ల జాబితా అత్యధికమనే చెప్పుకోవాలి. అలాంటి జిల్లాలో ఇప్పుడు బిసిల మాటున కుల రాజకీయం తెరపైకి వస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బిసిలకు పెద్దపీట వేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలే ఈ చర్చకు దారితీస్తున్నాయట. ఇవి అధికార పార్టీకి కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తుండగా, ప్రతిపక్ష తెలుగుదేశాన్ని మాత్రం ఇరుకున పడేస్తున్నాయట.
శ్రీకాకుళం జిల్లాలో బిసి నేతలుగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ మాజీ విప్ కూనరవి అరెస్టులతో అక్కడి రాజకీయం వేడేక్కింది. వైఎస్ జగన్ వెనుకబడిన సామాజిక వర్గాన్ని అణగ దొక్కుతున్నారని, టిడిపి చేసిన ఆరోపణలు పొలిటికల్ హీట్‌కి కారణమయ్యాయి. దీంతో తమ పార్టీ నేతల అరెస్టులను, బిసిలపై కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణిస్తూ ఆ మేరకు సింపతి కొట్టేయాలని తెలుగుదేశం ఆశించింది. అందుకోసం జిల్లా నేతలంతా తమ మధ్య ఉన్న విబేధాలను సైతం పక్కనబెట్టి ఒకతాటిపైకి వచ్చి, టిడిపి నాయకుల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఇక బిసిలపై అధికార పార్టీ వివక్ష, జగన్ బిసిల వ్యతిరేకి అంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున ప్రచారం మొదలెట్టింది. అయితే, అధికారపక్షం మాత్రం, టీడీపీ స్ట్రాటజీని అదే బీసీ మంత్రంతో మళ్లీ తిప్పికొట్టిందన్న చర్చ జరుగుతోంది.
తమపై, తమ ప్రభుత్వంపై టిడిపి చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు వైసిపి గట్టిగానే బదులిచ్చింది. అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించగలరా అంటూ ప్రశ్నించింది. అయితే బిసిలను తమకు దూరం చెయ్యాలన్న తెలుగుదేశం కుట్రలో భాగంగానే, తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఒకవైపు పార్టీ నాయకుల ద్వారా ప్రజలకు వివరిస్తూనే, ఇప్పుడు బిసిలను తమవైపు తిప్పుకునేందుకు జగన్ కొత్త వ్యూహం సిద్ధం చేసుకున్నారట. ఇందులో భాగంగానే రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీదిరి అప్పలరాజును మంత్రి వర్గంలోకి తీసుకున్నారనే చర్చ జోరందుకుంది. మరో బిసి నేతగా ఇప్పటికే జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ కు సైతం ఉపముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. సభాపతి సైతం బిసి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో, ఈ అంశాల ద్వారా జగన్ బిసిల పక్షపాతి అని మరోసారి రుజువయ్యిందనే వాదనను, ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఎత్తుగడతో, తమపై ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను కూడా తొలగించుకోవాలని ఆలోచనలో ఉందట అధికారపక్షం. వైసీపీ బీసీ రివర్స్ అటాక్‌తో తెలుగుదేశానికి మాటల్లేకుండా పోయాయన్నది నేతల మాట.
అదే సమయంలో బిసి కులాలకు సంబంధించి 52 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, ఆయా కార్పొరేషన్‌లలో అన్ని కులాల వారికి ప్రాధాన్యం ఉండాలని సీఎం జగన్ నిర్ణయించడం కూడా బిసిలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో భాగమే అనే చర్చ జరుగుతోంది. అయితే రానున్న రోజుల్లో వీటన్నిటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా స్థానిక ఎన్నికల నాటికి, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చెయ్యాలన్నది అధిష్టానం ఆలోచనగా పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారట. అయితే టిడిపి తమపై చేస్తున్న దుష్పచారాన్ని వైసిపి ఏ మేరకు తిప్పికొడుతుంది..? బిసిలను తమవైపు తిప్పుకునేందుకు జగన్ రచించిన వ్యూహం ఫలిస్తుందా..? రానున్న రోజుల్లోనే ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది.