చారిత్రక ఆధారాలు కూల్చివేత దారుణం : అశోక్ గజపతిరాజు

విజయనగరంలో చారిత్రాత్మక మూడు లాంతర్ల స్తంభాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు.

Update: 2020-05-23 11:46 GMT
Ashok Gajapathi Raju (File Photo)

విజయనగరంలో చారిత్రాత్మక మూడు లాంతర్ల స్తంభాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న మూడు లాంతర్ల స్తంభం 1860 ప్రాంతంలో ఏర్పాటైనట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పుడీ స్థూపం స్థానంలో కొత్తది నిర్మించాలని అధికారులు ప్రయత్నిస్తుండడం స్థానికంగా ఎంతో అసంతృప్తి కలిగిస్తోంది.

200 ఏళ్లకు పైగా ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఆ కట్టడం కూల్చివేత పట్ల అశోక్ గజపతిరాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న స్థూపాన్ని కూల్చడం ద్వారా జాతీయ చిహ్నాన్ని సైతం అధికారులు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా చాలా చారిత్రక కట్టడాలు కూల్చే ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. దీనిపై విజయనగరం పౌరులతో కలిసి శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతామని అన్నారు.

ఈ మూడు లాంతర్ల స్తంభం స్థానంలో అక్కడ రూ.5లక్షలతో మూడు లాంతర్లను ఏర్పాటు చేయనున్నారట. ముగ్గురు మహిళలు పట్టుకొని నిల్చున్నట్లు నిర్మాణం చేస్తారు. ప్రస్తుతం కట్టడం 8 అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. కొత్తది 3 అడుగుల్లో నిర్మించడానికి ప్రతిపాదించారట.


Tags:    

Similar News