Chandrababu Naidu slams Ys Jagan: ఏపీలో గవర్నమెంట్ టెర్రరిజం తెచ్చారు..108 అంబులెన్స్ లలో రూ. 307స్కామ్ : చంద్రబాబు
Chandrababu Naidu slams Ys Jagan: జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
Chandrababu Naidu slams Ys Jagan: జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వ అధికారం చేపట్టగానే పోలవరంలోఅవినీతి జరిగిందని ఎన్నో అరోపణలు చేశారని, ఇప్పడు అవన్ని అబద్ధాలే అని కేంద్రమే చెప్పిందన్నారు. పోలవరంలో, పట్టిసీమలో అవినీతి జరగలేదని కేంద్ర జనవనరుల శాఖ స్పష్టంగా చెప్పిందని చంద్రబాబు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులతో, టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్‌లైన్‌లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు.
ఏడాది కాలంలో రాష్ట్రంలో గవర్నమెంట్ టెర్రరిజం తెచ్చారని, బీహార్ ఆఫ్ సౌత్‌గా ఆంధ్రప్రదేశ్ ను మార్చారని పారిశ్రామిక వేత్తలు అంటున్నారని చంద్రబాబు పార్టీ నేతలతో జరిగిన భేటీలో వ్యాఖ్యానించారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి కూడబలుక్కుని రాష్ట్రాన్ని దోచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సొంత కంపెనీల కోసం ఏ1, వియ్యంకుడి కంపెనీల కోసం ఏ2 చేస్తున్న కుంభకోణాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కాపులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లకు తూట్లు పొడిచారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు తొలగించాలనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పంచాయితీ భవనాల రంగులు తొలగిస్తున్నారని తెలిపారు.
ఇళ్ల స్థలాల కోసం భూసేకరణకు చేస్తున్న ఏనిమిది వేల కోట్లలో 5 వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారని విమర్శించారు. దళితులపై 13 నెలలుగా దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని విమర్శించారు. ఏపిలో గత 5 వారాల్లో నాలుగు వందల శాతం కరోనా కేసులు పెరగడం ఆందోళనకరమని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం మాస్క్‌లు పెట్టుకోకుండా ప్రజలకు ఏవిధమైన సంకేతాలు పంపారో చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో 108 అంబులెన్స్ లలో 307 కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అసభ్య ప్రచారంపై చర్యలు లేవని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.