అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నాం..జూమ్ లో మాక్ అసెంబ్లీ: అచ్చెన్నాయుడు
AP Assembly Sessions: తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.
AP Assembly Sessions: తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 20 తేది నుంచి జరగబోయే శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నాట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఎల్లుండి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు అచ్చెన్నాయుడు తెలిపారు. మార్చిలోనే కేంద్రం సహా అనేక రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బడ్జెట్ ఆమోదించుకుంటే, కరోనా ఉందని జగన్ అసెంబ్లీ సమావేశాలు పెట్టలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
కేవలం ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు జరపడం మంచి పద్ధతి కాదని అన్నారు. రాష్ట్రంలో కరోనా ఇప్పుడు లేదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోకుండా, చనిపోతే అంత్యక్రియలకు డబ్బులు ఇస్తామనే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేం శాసనసభ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నాం అని వెల్లడించారు. ఏవిధంగా ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు జరుపుతారు? అని అచ్చెన్నాయుడు నిలదీశారు.
ఎల్లుండి అసెంబ్లీ ఎన్నిగంటలకు సమావేశమవుతుందో, తాము కూడా అన్ని గంటలకే జూమ్ యాప్ లో మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని తెలిపారు.కరోనా విషయంలో ఒక్కసారైనా అఖిలపక్షం ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. జగన్ నిర్లక్ష్యం కారణంగా ఆక్సిజన్ అందక రాష్ట్రంలో 106 మంది మరణించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.