రేపు టీడీపీ, జనసేన జేఏసీ సమావేశం
AP News: రాజమండ్రి మీటింగ్ తర్వాత రెండో కీలక సమావేశం
AP News: తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది.? రెండు పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎలా చేస్తాయి. ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆసక్తిగా మారింది. రెండు పార్టీలు కలిసి ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసాయి. ఈ కమిటీ మొదటిసారి రాజమండ్రిలో సమావేశమైంది. ప్రభుత్వంపై ఆందోళనల కంటే రెండు పార్టీల కలయికపైనే ముందుగా దృష్టి పెట్టాయి.
రాష్ట్ర స్థాయిలో జరిగిన సమావేశానికి నారా లోకేష్‌తో పాటు పవన్ కళ్యాణ్ హాజరై క్యాడర్‌కు పలు సూచనలు చేశారు. ఇక ఆ తర్వాత జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాలు జరిగాయి. రెండు పార్టీల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగడంపైనే ఈ సమావేశంలో చర్చించాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ సమావేశాలు క్యాడర్ మధ్య కలయిక కోసం ఏర్పాటు చేసినవే. ముఖ్యంగా పొత్తు వల్ల రెండు పార్టీల నాయకుల్లో గానీ కార్యకర్తల్లో గానీ మనస్పర్ధలు లేకుండా ముందుకెళ్లేలా ఈ సమావేశాలు నిర్వహించారు. మరోవైపు ఓటు బదలాయింపుపైనా సమన్వయ సమావేశాల్లో చర్చించారు. రెండు పార్టీల ఓట్లు ఇతర పార్టీలకు మళ్లకుండా ఉమ్మడి అభ్యర్ధికే ఖచ్చితంగా వేసేలా చూడాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
రేపు మరోసారి టీడీపీ, జనసేన జేఏసీ సమావేశం కానున్నాయి. రాజమండ్రి మీటింగ్‌తరువాత రెండో కీలక సమావేశం జరగనుంది. రాజమండ్రి మీటింగ్ తర్వాత జరిగే కీలక సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మరో 5నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో గేర్ టీడీపీ, జనసేన రెండు పార్టీలు గేరు మార్చుతున్నాయి.
ఓ వైపు కోర్టుల్లో టీడీపీ న్యాయపోరాటం కొనసాగుతుండగా..మరోవైపు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. కష్టకాలంలో టీడీపీకి జనసేన సహకారం కలిసొచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారు. మరి ఈ రెండు పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? కోర్టుల్లో ఉన్న కేసుల నుండి బాబు బయటపడతారా..? పార్టీ క్యాడర్‌కి టీడీపి, జనసేనలు భరోసా ఇవ్వగలవా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.