Parishad Election: ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ

Parishad Election: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోన్న ఎస్‌ఈసీ * హైకోర్టును ఆశ్రయించిన విపక్షాలు

Update: 2021-04-06 01:22 GMT

ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Parishad Election: ఏపీలో పరిషత్‌ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. కొత్త నోటిఫికేషన్ కోరుతూ ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయా? లేదా అనే ఆసక్తి నెలకొంది. దీనిపై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. అయితే ఎస్‌ఈసీ మాత్రం దూకుడు పెంచారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం, ఎస్ఈసీ నీలం సాహ్ని ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మరోవైపు విపక్షాలు మాత్రం షెడ్యూల్‌పై ఆందోళన చేస్తున్నాయి. మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై హైకోర్టును కూడా ఆశ్రయించాయి. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఇవాళ్టికి రిజర్వ్‌ చేసింది. దీంతో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది.

హైకోర్టు తీర్పు రిజర్వ్‌లోనే ఉండగా ఎస్‌ఈసీ నీలం సాహ్ని మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏప్రిల్ 8న సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో కార్యాలయాలు, వ్యాపారాలు బంద్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ప్రదేశాల్లో అన్ని నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణకు ప్రభుత్వ వాహనాలు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ జీఓ జారీ చేశారు. పబ్లిక్ మీటింగ్‌ల నిర్వహణకు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్న ఎస్‌ఈసీ.. ఒకే చోట, ఒకేసారి మీటింగ్‌లు నిర్వహించాల్సి వస్తే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

ఇక పరిషత్ ఎన్నికల్లో సిరా చుక్క వేలు మారనుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వేసిన ఇంక్ మార్క్ పోనందున పరిషత్ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలుకు ఇంక్ వేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా పనిచేయరాదని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మొత్తానికి పరిషత్ ఎన్నికల వివాదం కోర్టులో ఉండటంతో ఇప్పుడు అందరి చూపు తీర్పువైపే ఉంది. అయితే అధికార, విపక్షాలు తీర్పు తమకే అనుకూలంగా వస్తున్నాయనే దీమా వ్యక్తం చేస్తుండగా అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. 

Full View


Tags:    

Similar News