Anandayya Ayurvedic Medicine: మందు పంపిణీపై వీడని సస్పెన్స్
Anandayya Ayurvedic Medicine: కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధం పంపిణీపై ఇంకా ఉత్కంఠ వీడలేదు.
Anandayya Ayurvedic Medicine: కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధం పంపిణీపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఆనందయ్య మందును ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోనేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అనంతపురం జిల్లాకు చెందిన ఉమా మహేశ్వర నాయుడు తరపున న్యాయవాది బాలాజీ నిన్న హైకోర్టును ఆశ్రయించాడు. కరోనా నివారణకు ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని పిటిషనర్ తెలిపారు. ఆనందయ్య తయారు చేస్తున్న మందును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని పిటిషనర్ ఆరోపించారు. ఈ విషయమై విచారణ జరపాలని ఆయన కోరారు.
ఆనందయ్య మందు పంపిణీపై దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ మందుపై ఆయుష్ టీమ్ అధ్యయనం చేసింది. ఔషధం తయారీకి వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించిన బృందం ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలను వాడటం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ శాస్త్రీయత ధృవీకరణ జరిగే వరకు ఆనందయ్య మందును నాటు మందుగానే పరిగణిస్తామని ఆయుష్ చెప్పింది. మరోవైపు ఈ ఔషధం పరిశీలనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ రంగంలోకి దిగింది. ఆనందయ్య మందు ఆయుర్వేదమా..? కాదా..? అనే విషయాన్ని సీసీఆర్‌ఏఎస్ తేల్చనుంది.
ఇక తన మందు ఆయుర్వేదమేనని. దాదాపు 60 వేల మంది తన మందు తీసుకుని, కోలుకున్నారని అంటున్నారు ఆనందయ్య. వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని చెబుతున్నారు.